ఎప్పుడో సీఎం అయ్యే వాడిని!

Dinakaran Fires On Palani Swamy - Sakshi

ద్రోహుల్ని తరిమి కొట్టి తీరుతాం

పళని సర్కారు కుప్పకూలడం ఖాయం

దినకరన్‌ ధీమా

సాక్షి,చెన్నై : తలచుకుని ఉంటే, తానెప్పుడో సీఎం అయ్యే వాడినని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ వ్యాఖ్యానించారు. ద్రోహుల్ని తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని, పళని సర్కారు కుప్ప కూలడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. గురువారం ఈరోడ్‌లో కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ నినాదంతో అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమం సాగింది. ఈసందర్భంగా మీడియాతో దినకరన్‌ మాట్లాడారు. కావేరి వ్యవహారంలో కేంద్రంలోని మోదీ సర్కారు, రాష్ట్రంలోని పళని ప్రభుత్వం పథకం ప్రకారం కపట నాటకాలను ప్రదర్శిస్తున్నాయని మండి పడ్డారు. కేంద్రానికి రాష్ట్ర ప్రయోజనాలను పళని, పన్నీరు తాకట్టుపెట్టేశారని, వాటిని మళ్లీ దక్కించుకోవాలంటే, ఈ ప్రభుత్వం కుప్పకూలాల్సిందేనని పేర్కొన్నారు. అందుకు తగ్గ సమయం ఆసన్నమైందన్నారు. అనర్హత వేటు వ్యవహారంలో తీర్పు తమకు అనుకూలంగా వచ్చిన మరుక్షణం పళని సర్కారు కుప్పకూలినట్టేనని, తీర్పు త్వరితగతిన వెలువరించేందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని తాము అభ్యర్థిస్తున్నామన్నారు.

ద్రోహుల్ని తరిమి కొడతాం
రాజకీయాలంటే  ఏమిటో తెలియని పన్నీరు సెల్వంను తీసుకొచ్చి సీఎం పదవిలో చిన్నమ్మ శశికళ కూర్చొబెట్టారన్నారు. అమ్మ మరణం తదుపరి రెండో సారిగా కూడా చాన్స్‌ ఇస్తే, ఏకంగా అన్నాడీఎంకేని బీజేపీకి తాకట్టు పెట్టడానికి ప్రయత్నాలు చేశారన్నారు. పళని స్వామిని సీఎంగా చేస్తే, ఆయన ఏకంగా అన్నాడీఎంకేను, ప్రభుత్వాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టి, వారి అడుగులకు మడుగులు వత్తే పనిలో పడ్డారని ధ్వజమెత్తారు. తాను తలచుకుని ఉంటే, ఎప్పుడో సీఎం అయ్యే వాడినని ధీమా వ్యక్తంచేశారు. అయితే, తనకు గాని, తన కుటుంబంలోని వారికి గాని పదవీ ఆశ లేనందున, అన్నాడీఎంకే కోసం అమ్మ వెన్నంటి ఉండి శ్రమించామన్నారు. అయితే, ప్రస్తుతం ఆ పార్టీని రక్షించుకోవాలని తాపత్రయపడుతున్నట్టు వివరించారు. ఆ ఇద్దరు ద్రోహులకు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని, వారిని తరిమి కొట్టే రోజులు రాబోతున్నాయని పేర్కొన్నారు. పోలీసుల్ని తమ మీదకు ఉసిగొల్పుతున్నారని, మున్ముందు అదే పోలీసులు ఆ ఇద్దరినీ టార్గెట్‌ చేయడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top