నాలిక కరుచుకున్న డిగ్గీ రాజా

Digvijaya Singh Apologises After Tweeting Fake Image of Pakistan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ పప్పులో కాలేశారు.  పాత ఫోటో ఒకదానిని సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేసి ట్రోలింగ్‌ను ఎదుర్కున్నారు. పాత ఫోటోకు, అసలు ఫోటోకు ఆ మాత్రం తేడా తెలీదా అంటూ కొందరు ఆయన పరువు తీసేస్తున్నారు. 

విషయం ఏంటంటే భోపాల్‌ రైల్వే బ్రిడ్జి ఫోటో పరిస్థితి అంటూ డిగ్గీ రాజా శనివారం ఓ ట్వీట్‌ చేశారు. ‘పౌరుల భద్రత కోసం బీజేపీ తెగ శ్రమిస్తున్నట్లు చెబుతోంది. కానీ, ఇది పరిస్థితి. వారణాసిలో 18 మంది మృతి చెందిన ఘటన వాళ్లకు గుర్తుండే ఉంటుంది’ అంటూ సందేశం ఉంచారు. అయితే అది  గతంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన పాక్‌ మెట్రో పిల్లర్‌(విరిగిపోయిన) ఫోటో. ఫేక్‌ న్యూస్‌లపై అసలు గుట్టును విప్పే ఓ ప్రముఖ పత్రిక దిగ్విజయ్‌ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ కథనం ప్రచురించింది. 

దిగ్విజయ్‌ క్షమాపణలు.. ఆ కథనం చూసిన దిగ్విజయ్‌ సింగ్‌  తన తప్పు ఒప్పుకున్నారు. ‘తప్పు నాదే. క్షమించండి. నా స్నేహితుడొకరు ఆ ఫోటోను నాకు పంపారు. దానిని పరీశించకుండా నేను పోస్ట్‌ చేశా’ అంటూ ఆయన రీట్వీట్‌ చేశారు. 

గతంలోనూ ఇదే ఫోటో... అన్నట్లు రెండేళ్ల క్రితం తెలంగాణలో ఇదే ఫోటో హాట్‌ టాపిక్‌గా మారింది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలో ఫోటో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ‘హైదరాబాద్‌ మెట్రో పిల్లర్‌ ప్రమాదకరంగా ఉందంటూ... ఫోటో వైరల్‌ కాగా, స్వయానా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అది ఫేక్‌ అని, రావల్పిండి(పాక్‌) ఫోటో అంటూ స్పష్టత ఇచ్చేశారు.

సోషల్‌ మీడియాలో గతంలో ఇలాంటి ఉదంతాలే చాలానే వెలుగు చూశాయి. దిగ్గజ నటి షబానా అజ్మీ ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. మన రైల్వే శాఖ మురికి నీటిలో పాత్రలను శుభ్రం చేస్తోందంటూ ఓ సందేశం ఉంచారు. అయితే  ఈ వీడియోపై విచారణ చేపట్టిన రైల్వే శాఖ అది మలేషియాలోది అని తేల్చగా.. చివరకు ఆమె క్షమాపణలు చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top