రానున్నది రాజన్న రాజ్యమే 

Damodar Raja Narasimha about Manifesto - Sakshi

కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ 

మేనిఫెస్టోలోని హామీలన్నీ నెరవేరుస్తాం

టేక్మాల్‌(మెదక్‌): కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అందించిన సుపరిపాలన అందిస్తామని ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సోమవారం మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలంలోని పలు గ్రామాల్లో దామోదర ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ మేనిఫెస్టో ప్రకారం 58 ఏళ్లకే అర్హులైన వారందరికీ పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉచిత విద్యుత్‌ అందజేస్తామన్నారు. వైఎస్సార్‌ హయాంలో జరిగిన రైతు ఏకకాల రుణమాఫీ మాదిరిగానే ప్రస్తుతం కూడా రూ.2 లక్షల వరకు అమలు చేస్తామన్నారు.

మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాల పేరుతో కోట్లాది రూపాయలను వృథా చేసిన కేసీఆర్‌ ఇంటింటికీ నీరిచ్చే వరకు ఓట్ల అడగనని చెప్పి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఆయన విమర్శించారు. పాత ఇళ్ల బకాయిలను చెల్లిస్తూ ఇళ్లు లేని వారికి రూ.5 లక్షలను ఇళ్లు నిర్మించుకోవడానికి అందిస్తామని దామోదర అన్నారు. మహిళలకు అభయహస్తం, ఆమ్‌ ఆద్మీ, పేద కుటుంబాలకు జనశ్రీ బీమా యోజన పథకాలతో పాటు ఏడాదికి ఆరు ఉచిత సిలిండర్లను అందజేస్తామని తెలిపారు. మహిళా సంఘాలకు రూ.10 లక్షల వడ్డీ మాఫీ చేయడంతో పాటు రూ. లక్ష ఉచిత గ్రాంట్‌ అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీతో పాటు నిరుద్యోగ భృతి అందించనున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top