బాబును పట్టుకుని వేలాడటం రామోజీకి అవసరమా?

Dadi Veerabhadra Rao Slams Chandrababu - Sakshi

విశాఖపట్నం : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అసాంఘిక శక్తిగా తయారయ్యారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దాడి వీరభద్రరావు విమర్శించారు. రాజధాని రైతులను చంద్రబాబు కావాలనే రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఉద్యమానికి ఇంటికొకరు రమ్మని చంద్రబాబు పిలవడం చూస్తే.. ఆయన బకాసురుడేమో అనిపిస్తోందన్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని అంశంపై ఈనాడు పత్రిక ప్రజలను మభ్య పెడుతోందని తెలిపారు. ఇంకా చంద్రబాబును పట్టుకోని వేలాడటం రామోజీరావు అవసరమా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేయొద్దని రామోజీకి మనవి చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం న్యాయబద్ధంగా వాస్తవాలు రాయాలని కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి అపఖ్యాతి తెచ్చేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు భిక్షాటన చేయడం సిగ్గుచేటని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన విరాళాలను చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. 

చంద్రబాబు ఐదేళ్ల పాలనంతా అవినీతిమయని దాడి వీరభద్రరావు మండిపడ్డారు. 5 కోట్ల మంది తీర్పుతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా గెలిచారని అన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని చంద్రబాబు గుర్తించం లేదని.. పైగా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాలిచ్చారని గుర్తుచేశారు. విశాఖకు వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. విశాఖ రాజధానిగా ఉంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఒక్క చంద్రబాబు మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. అరాచక పాలనంతా చంద్రబాబు హయాంలోనే జరిగిందని చెప్పారు.

ఐదేళ్ల పాలనలో చంద్రబాబు రూ. 2.50 లక్షల కోట్లు అప్పు చేశారని.. అందులో కొంత భాగం కేటాయించి రాజధాని నిర్మాణం చేయొచ్చుగా అని సూటిగా ప్రశ్నించారు. అప్పు తెచ్చిన డబ్బును చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. కేంద్రం రూ. 2,500 కోట్లు ఇస్తే చంద్రబాబు ఒక శాశ్వత భవనమైన కట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు రాజధానిని నిర్మించలేదని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజలు చేతకాని వారు కాదని.. భయపెట్టాలని చూడొద్దని హితవుపలికారు. అవసరమైతే విశాఖ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. 33వేల ఎకరాలను చంద్రబాబు ప్రజల నుంచి లాక్కున్నారని.. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌కు నారాయణ బ్రోకర్‌ అని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top