శశికళ కుటుంబంలో ‘ఆర్కేనగర్‌’ చిచ్చు!

Cracks Appear in Sasikala Family After RK Nagar Win - Sakshi

దినకరన్, భాస్కరన్, కృష్ణప్రియల వాగ్యుద్ధం

నటరాజన్‌ ఇంట్లో శశికళ కుటుంబ సభ్యులు

వారసత్వంపై పంచాయితీ

ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్‌ గెలుపు శశికళ కుటుంబంలో ఆధిపత్య పోరుకు దారితీసింది. శశికళ సోదరి కుమారుడైన దినకరన్, ఆయన సోదరుడు భాస్కరన్‌.. శశికళ మేనకోడలు కృష్ణప్రియల మధ్య రాజకీయ వారసత్వం కోసం అంతర్గత కుమ్ములాట మొదలైనట్టు తెలిసింది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలనే కాదు, శశికళ కుటుంబంలో సైతం కలకలం రేపాయి. రాజకీయ వారసులు ఎవరనే అంశంలో కలతలు సృష్టించాయి. కుటుంబసభ్యులతో శశికళ భర్త నటరాజన్‌ ఇటీవల నిర్వహించిన వారసత్వ పంచాయితీ... పార్టీ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు దినకరన్‌ సిద్ధపడేవరకు వెళ్లింది. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో భారీ అధిక్యతతో దినకరన్‌ గెలుపొందిన సమయంలో జయలలిత, శశికళకు తానే అసలైన రాజకీయ వారసుడినని దినకరన్‌ ప్రకటించడం వారి కుటుంబంలో చిచ్చు రేపింది.

ఆర్కేనగర్‌లో దినకరన్‌ను గెలిపించడం ద్వారా ప్రజలు, ఎంజీఆర్‌ స్థాపించిన అన్నాడీఎంకేకు తామే వారసులమని రుజువైందని దినకరన్‌ తమ్ముడు భాస్కరన్‌ ప్రచారం మొదలుపెట్టారు. పార్టీ నడిపించే హక్కు తమకు మాత్రమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం వద్ద రెండాకుల చిహ్నం మాత్రమే ఉంది, అది వారికి ఎలా వచ్చిందో అందరికీ తెలుసు, అయితే పార్టీ, కార్యకర్తలు తమవైపు ఉన్నారని భాస్కరన్‌ చేసిన వ్యాఖ్యలు దినకరన్‌కు ఆగ్రహం తెప్పిం చాయి. తమ ఇద్దరి మధ్య గత కొంతకాలంగా మాటలు లేవు, నేడు ఈ వాఖ్యానాలు ఏమిటని దినకరన్‌ ప్రశ్నించారు.

పార్టీ, ప్రభుత్వం ఏదైనా నా మాటే చెల్లుబాటని దినకరన్‌ చేసిన ప్రకటనను శశికళ కుటుంబ సభ్యులు స్వాగతించడం లేదు. జయలలిత మరణానికి శశికళే కారణమని ప్రజలు ఆరోపించినా ఆమె మౌనంగా భరించారని, అయితే ఎన్నికల కోసం అపోలో దృశ్యాలను విడుదల చేసి జయలలితను దినకరన్‌ అవమానపరిచారని ఫేస్‌బుక్, మీడియా వద్ద కృష్ణప్రియ విరుచుకుపడ్డారు. దినకరన్‌ అనుచరుడు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. తానే శశికళ వారసురాలినని కృష్ణప్రియ ప్రకటించుకోవడం దినకరన్‌ అనుచరుల్లో ఆగ్రహం తెప్పించింది.

దినకరన్, దివాకరన్, భాస్కరన్, వివేక్, కృష్ణప్రియల మధ్య చోటుచేసుకున్న విభేదాలు విశ్వరూపం దాల్చడంతో చెన్నై అడయారులోని శశికళ భర్త నటరాజన్‌ ఇంట రెండురోజుల క్రితం పంచాయితీ పెట్టారు. ఈ సమయంలో దినకరన్‌ మాట్లాడుతూ శశికళనో, మన కుటుంబాన్నో చూసి ఆర్కేనగర్‌ ప్రజలు ఓటువేయలేదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, తటస్థ ఓట్లే తనను గెలిపించాయని దినకరన్‌ వారి ముందు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మీరంతా ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండానే మేమే వారసులమని మీడియా ముందు ప్రకటించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.


కృష్ణప్రియ సీమంతం నాటి ఫొటోలు (ఫైల్‌)

కృష్ణప్రియకు రాజకీయాల గురించి ఏమి తెలుసు, జయలలిత సమక్షంలో పోయెస్‌గార్డెన్‌లో ఏనాడో జరిగిన తన సీమంతం ఫొటోను కృష్ణప్రియ ఇప్పుడు విడుదల చేయాల్సిన అవసరం ఏమిటని దినకరన్‌ రెట్టించి ప్రశ్నించారు. సీమంతం ఫొటో ద్వారా జయలలిత రాజకీయ, కుటుంబ వారసురాలిగా ప్రయత్నిస్తున్నారా అని కృష్ణప్రియను నిలదీశారు. మీడియాతో మాటలు, ఫేస్‌బుక్‌లో పోస్టింగులు ఇకనైనా నిలిపివేయాలని వారిని దినకరన్‌ హెచ్చరించినంత పనిచేశారు. అందరం ఇలా వ్యవహరిస్తే మళ్లీ చిక్కుల్లో ఇరుక్కుంటామని హితవు పలికారు. శశికళ చెబితేనే పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా, ఆమె ఆదేశిస్తే పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమని దినకరన్‌ కుటుంబ సభ్యులతో స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ ఈ దినకరన్‌ ఎక్కడున్నారు, ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడని కృష్ణప్రియ వ్యాఖ్యానించడంతో వారసత్వపోరు తారాస్థాయికి చేరుకున్నట్లు సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top