మళ్లీ తెరపైకి వామపక్ష ఐక్యత!

CPI and CPM are contesting separately in the last election - Sakshi

ఎన్నికల్లో ఓటమితో  మళ్లీ మొదలైన ప్రయత్నాలు 

గత ఎన్నికల్లో సీపీఐ,  సీపీఎం విడివిడిగా పోటీ 

కనీసం ఒక్క సీటూ దక్కని వైనం

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో పరస్పర పోటీలు, అవి ముగిశాక ఐక్యతా ప్రయత్నాలు అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలోని ఉభయ కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి. వామపక్షాల ఐక్యత అంటూ కొంత కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీపీఐ, సీపీఎం వేర్వేరుగానే పోటీచేశాయి. ఈ ఎన్నికల్లో ఈ పార్టీలకు కనీసం ఒక్క సీటైనా దక్కకపోగా ఆశించిన స్థాయి కంటే చాలా తక్కువగా ఓట్లు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఈ పార్టీల పరిస్థితి నిరాశాజనకంగా తయారైంది. ఎన్నికలకు ముందు ఇరు పార్టీల నేతలు తాము పోటీచేస్తున్న కూటముల విషయంలో పరస్పరం బహిరంగ విమర్శలకు సైతం దిగారు. కనీసం కలిసి పోటీ చేసే పరిస్థితులు లేకపోవడమే కాకుండా పరస్పర విమర్శలు చేసుకుంటుండటంతో ప్రస్తుతం ఈ రెండు పార్టీల జాతీయ నాయకత్వాలు ముందుగా రాష్ట్ర స్థాయిలో వామపక్ష ఐక్యతపై దృష్టి పెట్టాలంటూ ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వామపక్ష ఐక్యత అంటూ మళ్లీ రెండు పార్టీల మధ్య రాజీ ప్రయత్నాలు మొదలయ్యాయి.  

అంతకుముందు తలోదారి.. 
టీఆర్‌ఎస్‌ వ్యతిరేక శక్తులను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న ప్రయత్నాల్లో భాగంగా కాంగ్రెస్‌ ప్రజాఫ్రంట్‌ కూటమిలో సీపీఐ చేరింది. వివిధ రాష్ట్రాల్లో బీజేపీయేతర పక్షాలు, ప్రాంతీయ పార్టీలను ఒక దగ్గరకు చేర్చే ప్రయత్నాలకు ఇది ఊతమిస్తుందని ఆ పార్టీ భావించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల కల్లా జాతీయ స్థాయిలో ఫ్రంట్‌ ఏర్పడకపోయినా, రాష్ట్ర స్థాయిల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య స్నేహం పెరిగేందుకు ఇది ఉపయోగపడుతుందని సీపీఐ జాతీయ నాయకత్వం భావించింది. అందుకే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. మరోవైపు కాంగ్రెస్‌ ఉన్న కూటమిలో చేరేందుకు మొదటి నుంచీ సీపీఎం ఉత్సాహం చూపలేదు. కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరం పాటిస్తామంటూ గతంలో జాతీయపార్టీ చేసిన తీర్మానాన్ని ఆ పార్టీ ముందుకు తీసుకొచ్చింది. సీపీఐ, ఇతర వామపక్షాలు, సామాజిక సంఘాలు, సంస్థలతో కలిసి తన ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకే సీపీఎం మొగ్గుచూపింది. ఇందులో భాగంగా బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల ప్రయోగాలు విఫలం కావడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. మరోవైపు సీపీఐ, సీపీఎం జాతీయ పార్టీలు కూడా ముందు వామపక్ష ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ తాజాగా సూచించడంతో రాష్ట్ర స్థాయిలో కమ్యూనిస్టు పార్టీల ఐక్యతా ప్రయత్నాల్లో భాగంగా స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకోవడంపై ఈ పార్టీలు దృష్టి సారించాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top