సహకార సంఘాల ఎన్నికలకు బ్రేక్‌!

Cooperative Society Election Postponed - Sakshi

మరో ఆరు నెలలు పర్సన్‌ ఇన్‌చార్జుల కొనసాగింపు 

టెస్కాబ్, డీసీసీబీలకు కూడా...

సాక్షి, హైదరాబాద్‌: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్‌)కు ప్రస్తుతం కొనసాగుతున్న పర్సన్‌ ఇన్‌చార్జులను మరో ఆరు నెలల పాటు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (టెస్కాబ్‌), జిల్లా సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (డీసీఎంఎస్‌)లు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లకు కూడా మరో ఆరు నెలలు పొడిగించేందుకు మొగ్గుచూపుతున్నట్లు సహకారశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో సహకార ఎన్నికలు కూడా ఇప్పట్లో లేనట్టేనని ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి. వాస్తవానికి కొన్ని సహకార సంఘాలలోని పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది జనవరి 30వ తేదీ, ఫిబ్రవరి 3న, టెస్కాబ్‌కు ఫిబ్రవరి 26న, డీసీఎంఎస్‌లు, డీసీసీబీలకు ఫిబ్రవరి 18న ముగిసింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం పర్సన్‌ఇన్‌చార్జులను నియమించాలని సిఫార్సు చేయడంతో పాలకవర్గంలో ఉన్నవారినే పర్సన్‌ ఇన్‌చార్జులుగా ఆరు నెలలు కొనసాగించారు. పొడిగించిన సమయం మరో నెల రోజుల్లో ముగియనుంది.  

ఎన్నికలకు 45 రోజుల ముందుగానే.. 
ప్యాక్స్‌లకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే ఆయా పర్సన్‌ ఇన్‌చార్జుల పదవీకాలం ముగియడానికి కనీసం 45 నుంచి 60 రోజుల ముందుగా ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుంది. ఎన్నికలకు అవసరమైన నివేదికలను సహకార శాఖ ప్రభుత్వానికి ముందస్తుగానే నివేదించినా ఇప్పటివరకూ స్పందించలేదు. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో మరో ఆరు నెలలు పొడిగించేందుకు సంకేతమిచ్చినట్లైంది. సహకార చట్టం ప్రకారం ఆరు నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగించే వెసులుబాటు ఉంది. అయితే ఎన్నిసార్లు అలా పొడిగింపు ఇవ్వవచ్చనేది స్పష్టంగా లేదని అధికారులు చెబుతున్నారు. గతంలో ఓసారి ఏకంగా 11 ఏళ్ల పాటు సహకార సంఘాల పాలకవర్గాలు కొనసాగిన చరిత్ర ఉందని అంటున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top