దానం ఓ బచ్చా; ఆయనతో ఏమీ కాదు..!

Congress Leader Anjan Kumar Yadav Slams Danam Nagender - Sakshi

దానంపై నిప్పులు చెరిగిన అంజన్‌కుమార్‌ యాదవ్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీమంత్రి దానం నాగేందర్‌పై కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌ అధ్యక్షుడు అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ప్రధాన కార్యదర్శి మహేష్‌ గౌడ్‌ నిప్పులు చెరిగారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. ‘దానం ఓ బచ్చాగాడు. అతను చెప్పడం వల్లనే నాకు అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారనడం హస్యాస్పదం’ అని అంజన్‌కుమార్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. నాగేందర్‌ కాంగ్రెస్‌ను వీడడం వల్ల జరిగే నష్టమేమీ లేదని అన్నారు. అయినా, ఇప్పటికే పలుమార్లు పార్టీలు మారిన నాగేందర్‌ పార్టీని వీడడం ఒకందుకు మంచిదేనని అన్నారు. కాంగ్రెస్‌ తనకు అన్యాయం చేసిందని చెప్పుకు తిరుగుతున్న దానంకు సిగ్గుండాలని అన్నారు.  హైదరాబాద్‌లో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు.

కబ్జాదారున్ని ఎందుకు చేర్చుకున్నారు..?
‘దానం నాగేందర్‌ భూ కబ్జాదారుడని హోం మంత్రి గతంలో అన్నారు. అలాంటి కబ్జాదారున్ని పార్టీలో ఎందుకు చేర్చుకున్నార’ని పొన్నం ప్రభాకర్‌ టీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్‌పై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. బీసీలకు పార్టీలో అన్యాయం జరుగుతోందని చెప్పుకుంటున్న దానం.. టీఆర్‌ఎస్‌ పాలనలో బీసీల అభివృద్ధికి కేటాయించిన నిధులెన్నో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వలిగొండ ట్రాక్టర్‌ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు పొన్నం తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 15 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అగ్రవర్ణాలకు దాసోహం..
దానం ఒక బీసీ అయివుండి అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి మహేశ్‌గౌడ్‌ విమర్శించారు. బీసీ సమస్యలపై ఏనాడూ పోరాడని దానం తనకు పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్‌ వైఖరేమిటో ప్రజలకు తెలుసునని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top