‘మీ పోరాటాన్ని యావత్‌ భారత్‌ గమనిస్తోంది’

CM Ashok Gehlot Says Entire Country Eyes On Their Way Of Fighting - Sakshi

జైపూర్‌/ఢిల్లీ: ఎప్పటికైనా సత్యమే జయిస్తుందని రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ వ్యాఖ్యానించారు. తమ ఎమ్మెల్యేలు పోరాడుతున్న తీరును యావత్‌ భారత్‌ గమనిస్తోందని చెప్పారు. తన ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మంగళవారం మరోసారి కాంగ్రెస్‌ శాసన సభా పక్ష (సీఎల్పీ) భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సత్యమే దైవం, దైవమే సత్యం. సత్యం మనతో ఉంది. అసమ్మతి వాదుల కుట్రల నుంచి ప్రభుత్వాన్ని, దాంతోపాటు ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు మీరు చేస్తున్న పోరాటాన్ని దేశ ప్రజలందరూ గౌరవిస్తున్నారు. మనమంతా సర్వశక్తిమంతంగా ఉన్నాం’అని పేర్కొన్నారు. ‘మీపై ఉన్నగౌరవం ఎన్నో రెట్లు పెరిగింది. ఇది సాదారణ విషయం కాదు. అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలు జరగాలని కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ కోరుకోలేదు. కొందరి కుట్రల వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయి. అయినప్పటికీ పోరాడి విజయం సాధిద్దాం’ అని అన్నారు.

ఇదిలాఉండగా.. హోటల్‌లో తమను నిర్బంధిచారని భారతీయ ట్రైబల్‌ పార్టీ (బీటీపీ) ఎమ్మెల్యే ఒకరు వారం క్రితం చెప్పడంతో గహ్లోత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, బీటీపీ తర్వాత గహ్లోత్‌ ప్రభుత్వానికి స్పష్టమైన మద్దతు ప్రకటించడంతో ఆ విషయం అంతటితో ముగిసిపోయింది. ఈనేపథ్యంలోనే గహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యేలు అంత్యాక్షరీ ఆడినవి, యోగా ఫొటోలు, వంటలు నేర్చుకుంటున్న వీడియోలను విడుదల చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రజలు కరోనా వైరస్‌తో పోరాడుతుంటే సీఎం, ఎమ్మెల్యేలు పార్టీలు చేసుకుంటున్నారని బీజేపీ విమర్శలు చేస్తోంది. ఇక అసమ్మతి ఎమ్మెల్యేల అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాజస్తాన్‌ స్పీకర్‌ను నేడు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వచ్చే శుక్రవారం (జులై 24) హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 
(చదవండి: రాజస్తాన్‌: సచిన్‌ పైలట్‌కు హైకోర్టులో ఊరట)
(అసమర్థుడు.. పనికిరాని వాడు! )

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top