చింతమనేనిని అరెస్టు చేయాలి

Chintamaneni should be arrested - Sakshi

దెందులూరులో ప్రజాస్వామ్యం ఖూనీ

చర్యలకు ఆళ్ళ నాని, కోటగిరి, కొఠారు డిమాండ్‌

ఏలూరు టౌన్‌:  దెందులూరు నియోజకవర్గంలో  పేదలు, దళితులపై నిరంతరం దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కఠిన చర్యలు తీసుకుని..వెంటనే అరెస్టు చేయాలని వైఎస్సార్‌ సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. నాయుడుగూడెంలో దళితులపై అర్ధరాత్రి వేళ పోలీసులతో కలిసి టీడీపీ నేతలు చేసిన దాడుల్లో  మహిళలు తీవ్రంగా గాయపడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు, దళితులు ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ  జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు భారీసంఖ్యలో పార్టీ కార్యకర్తలు, దళితులతో కలిసి ఏలూరులో ర్యాలీ నిర్వహించారు.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ళ నాని మాట్లాడుతూ వందేళ్ల క్రితంనుంచి ఇళ్లు నిర్మించుకుని నివశిస్తున్న పేద దళితులను వెళ్లగొట్టి ..అక్కడ రోడ్డు వేయాలని నిర్ణయించడం.. దళితులపై చింతమనేనికి ఉన్న కక్షసాధింపు చర్యలకు నిదర్శనమన్నారు.

అర్థరాత్రి వేళ పోలీసులు గ్రామంలో మోహరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తమకు అన్యాయం జరిగిందని పేదలు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు.. చింతమనేని అరాచకాలకు వత్తాసు పలికేందుకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. చింతమనేనిపై నమోదు చేసిన ఏ ఒక్క కేసులో అయినా  పోలీసులు అరెస్టు చేశారా? పేదలకు న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. వట్లూరులో 300 ఎకరాల దళితుల భూములను ఓ టీడీపీ నేతకు కట్టబెట్టాలని చూస్తే..దళితులు తిరగబడితే నష్టపరిహారం ఇస్తామని స్వయానా కలెక్టర్‌ హామీ ఇచ్చినా.. అతీగతీ లేదని విమర్శించారు. నష్టపరిహారం అడిగిన దళితులను ఎమ్మెల్యే చింతమనేని  దారుణంగా వేధిస్తున్నారని చెప్పారు.  కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి, ఏలూరు పార్లమెంట్‌ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు మాట్లాడుతూ..టీడీపీ నేతల అరాచకాలు ఇలానే కొనసాగితే ప్రజలు ఈ ప్రభుత్వానికి  వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top