ఎన్నికల వేళ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu Controversial Comments on Income Tax Raids - Sakshi

సాక్షి, విజయవాడ: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తీరు విస్తుగొల్పుతోంది. తమ పార్టీ నాయకులపై ఐటీ దాడులకు వ్యతిరేకంగా శుక్రవారం చేపట్టిన ధర్నాకు జనం పెద్దగా రాకపోవడంతో మీడియాతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో అత్యంత సీనియర్‌నని చెప్పుకునే ఆయన ఎన్నికల ప్రశాంతతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రమంతా అట్టుడికి పోవాలంటూ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏమరుపాటుగా ఉంటే ఇవే చివరి ఎన్నికలు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్‌ రోజు వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ కార్యకర్తలకు సూచించారు.

అంతేకాకుండా అధికారులపై బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోవద్దని, తిరగబడాలని చంద్రబాబు అన్నారు. బాధ్యతాయుత స్థానంలో ఉండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని మేధావులు, సామాజిక కార్యకర్తలు తప్పుబడుతున్నారు. అధినేత పిలుపుకు స్పందించి తెలుగు తమ్ముళ్లు ఎటువంటి ఆందోళనలకు దిగుతారోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారాన్ని సైతం పక్కనపెట్టి నిరసనలకు పిలుపు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

కనకమేడల సుద్ధులు
ఆదాపపన్ను శాఖ సోదాలపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ తనదైన శైలిలో స్పందించారు. ‘ఎన్నికల సంఘానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇన్‌టాంక్స్‌ అధికారులందరినీ బోనులో నిలబెట్టి అసలు ఎందుకు దాడులు చేస్తున్నారని నిలదీయాల’ని అన్నారు. ఎవరి ఆదేశాలతో సీఎం రమేశ్‌ ఇంటిపై దాడులు చేశారని ప్రశ్నించారు. పుట్టా సుధాకర్‌ యాదవ్‌ నివాసంలో ఐటీ అధికారులను సీఎం రమేశ్‌ అడ్డుకోవడాన్ని ఆయన సమర్థించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top