రాహుల్‌తో కేంబ్రిడ్జ్‌ బాస్‌ భేటీ

Cambridge Analytica Pitched Election Strategy To Congress, Boss Met Rahul Gandhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌ డేటా ఉల్లంఘనలకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జి ఎనలిటికా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచారానికి ప్రతిపాదనతో ముందుకొచ్చిందనే వార్తలు దుమారం రేపుతున్నాయి. ఫేస్‌బుక్‌ పోస్ట్‌లు, ట్వీట్లను విశ్లేషించి ఓటర్లను పార్టీకి అనుకూలంగా ప్రభావితం చేసేలా రూ 2.5 కోట్ల డీల్‌ను కాంగ్రెస్‌ ముందుంచినట్టు ఎన్‌డీటీవీ వెల్లడించింది. కేంబ్రిడ్జ్‌ సీఈవో అలెగ్జాండర్‌ నిక్స్‌ గత ఏడాది అప్పటి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారని తెలిపింది.  మాజీ కేం‍ద్రమంత్రులు జైరాం రమేష్‌, చిదంబరంలతోనూ ఆయన భేటీ అయ్యారని పేర్కొంది. కేం‍బ్రిడ్జ్‌ ప్రతినిధులతో సమావేశమవడం నిజమేనని, అయితే ఆ కంపెనీతో పార్టీకి ఎలాంటి ఒప్పందం జరగలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. వాణిజ్య ప్రతిపాదన అందుకున్నంత మాత్రన ఇరువురి మధ్య ఒప్పందం జరిగిందనుకోవడం సరైంది కాదని కాంగ్రెస్‌ డేటా అనలిటిక్స్‌ విభాగ అధిపతి ప్రవీణ్‌ చక్రవర్తి వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీగా కాంగ్రెస్‌ పార్టీకి పలు సంస్థల నుంచి తరచూ ప్రతిపాదనలు వస్తుంటాయని చెప్పుకొచ్చారు. కేం‍బ్రిడ్జి అనలిటికాతో కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

రాహుల్‌ క్షమాపణకు బీజేపీ డిమాండ్‌

కాంగ్రెస్‌ పార్టీ కేంబ్రిడ్జి సేవలను ఉపయోగించుకున్నందున రాహుల్‌ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. కేంబ్రిడ్జి సేవలను కాంగ్రెస్‌ వాడుకుందని గతంలోనూ బీజేపీ ఆరోపించిన విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్‌ సహా పలు ఇతర భారత రాజకీయ పార్టీలూ కేం‍బ్రిడ్జి అనలిటికా సేవలను ఉపయోగించుకున్నాయని ట్వీట్‌ చేయడం ద్వారా ఓ ఎథికల్‌ హ్యాకర్‌ ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top