తప్పుడు వార్తపై వివరణ ఇవ్వాల్సిందే 

Botsa Satyanarayana Comments On Ramojirao - Sakshi

మీడియాతో మంత్రి బొత్స 

ఆఖరు దశలో ఇలాంటి ఆలోచనలు రామోజీ మానుకోవాలి 

రూ. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలపై బాబు, లోకేష్‌లు స్పందించరెందుకు? 

సాక్షి, అమరావతి:  తనపై ఈనాడు దినపత్రిక రాసిన తప్పుడు వార్తలపై వివరణ ఇవ్వాల్సిందేనని మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. తప్పును అంగీకరించకుండా తాను రామోజీరావుకు రాసిన బహిరంగ లేఖలో ప్రకటించినట్లుగా.. ‘ఆ మాట నేను అనలేదు’ అని వార్త ప్రచురించడంపై ఆయన మండిపడ్డారు. ‘అవసరమైతే ఎన్డీయేలో చేరతాం’ అంటూ శనివారం ఆ పత్రికలో వచ్చిన కథనంపై ఆగ్రహం వ్యక్తంచేసిన బొత్స.. తన వివరణకూ అంతే ప్రాముఖ్యతనిస్తూ ప్రచురించాలని అదేరోజు రామోజీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై ఆదివారం సంచికలో ఈనాడు స్పందించిన తీరుపై మంత్రి మరోసారి భగ్గుమన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ఆయన శనివారం అన్న మాటల వీడియోను ప్రదర్శించారు. 

వ్యక్తుల కోసం వ్యవస్థ నాశనం 
ఈనాడు విలేకరులు, ఆ సంస్థ యాజమాన్యం వ్యక్తుల కోసం వ్యవస్థలను నాశనం చేస్తున్నారని బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబును రక్షించడానికి రామోజీరావు ఇలా చేయడం సరికాదన్నారు. తనను తాను మేధావిగా చెప్పుకునే యనమల రామకృష్ణుడు ఐటీ శాఖ ఇచ్చిన వివరాలను కూడా తప్పుబడుతున్నారని ఎద్దేవా చేశారు. యనమల ఎవరిపై పరువు నష్టం దావా వేస్తారని.. రూ. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలపై బాబు ఆయన కుమారుడు లోకేష్‌లు ఎందుకు తేలు కుట్టిన దొంగల్లా మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

ఐటీ శాఖ చెబుతున్న మూడు కంపెనీలు టీడీపీకి చెందిన ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్, లోకేష్‌ బినామీ కిలారు రాజేష్, వైఎస్సార్‌ కడపజిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిలకు చెందిన కంపెనీలేనని బొత్స స్పష్టంచేశారు. కాగా, ఐదేళ్లలో ఒక లక్షా 95 వేల కోట్ల రూపాయల మేర చంద్రబాబు అప్పు చేశారని.. వాటితో ఎవరికైనా ఒక్క సంక్షేమ పథకంగానీ, ఒక్క ఇల్లుగానీ ఇచ్చారా అని మంత్రి ప్రశ్నించారు.రామోజీరావు తన ఆఖరి దశలో ఇలాంటి ఆలోచనలు మార్చుకోవాలని బొత్స హితవు పలికారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top