
సాక్షి, హైదరాబాద్ : గడిచిన కొన్ని ఏళ్లుగా కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న హత్యారాజకీయాలపై బీజేపీ, సీపీఎం తెలంగాణ శాఖలు పోటాపోటీ ప్రదర్శనలకు దిగడంతో సోమవారం హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
లోయర్ ట్యాంక్‌బండ్ ఇందిరాపార్క్ వద్ద గుమ్మికూడిన బీజేపీ శ్రేణులు.. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం(బసవపున్నయ్య భవన్) వైపునకు ర్యాలీగా బయలుదేరారు. అటు సీపీఎం శ్రేణులు సైతం పోటీ ర్యాలీకి సిద్ధమయ్యారు. అసలు ఈ రెండు పార్టీల ర్యాలీలకు అనుమతులే లేవంటూ పోలీసులు ఇరువర్గాలనూ అడ్డుకున్నారు.
కాగా, ఇందిరాపార్క్ సమీపంలోనే బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకు నాయకత్వం వహించిన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ల, మరికొందరు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగతావారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
బీజేపీ ఆందోళన పిలుపును ముందే ఇవ్వడంతో సీపీఎం కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీఎం అధికారంలో ఉన్న కేరళలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల హత్యలకు నిరసనగా తెలంగాణ బీజేపీ శాఖ ఈ ఆందోళన చేపట్టింది.
అటు సీపీఎం కార్యాలయం వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జాతీయ నాయకుడు అజీజ్ పాషాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.