ఓడిన చోటే గెలిచారు!

BJP And Congress Party Leaders  Talk On Lok Sabha Elections Results - Sakshi

ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీలుగా సోయం,  బొర్లకుంట 

 చివరి క్షణంలో పార్టీ మారి విజయకేతనం

ఆ నియోజకవర్గాల్లో గతం కంటే అధిక ఓట్లు

సోయం బాపురావు, వెంకటేశ్‌ నేతకు సారుప్యత

సాక్షి, ఆదిలాబాద్‌: ‘ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి’ అనేది పెద్దల మాట. ఈ విషయంలో తాజాగా ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులుగా గెలిచిన సోయం బాపురావు, బొర్లకుంట వెంకటేశ్‌ నేతకు ఈ నానుడి సరితూగుతుంది. గత డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సోయం బోథ్‌ నియోజకవర్గం, బొర్లకుంట చెన్నూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజకీయాల్లో ఒక్క అవకాశం చేజారితే మరో అవకాశం కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఇరువురికి డిసెంబర్‌ పోయిన వెంటనే ఏప్రిల్‌ కలిసి వచ్చింది. పార్లమెంట్‌ ఎన్నికల బరిలో దిగిన ఇరువురు గెలుపొందారు.

పార్టీ మారి..
శాసనసభ ఎన్నికల్లో సోయం బాపురావు బోథ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అంతకు ముందు ఆయన టీడీపీలో కొనసాగుతుండగా, రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ఇక బొర్లకుంట వెంకటేశ్‌ నేత కాంగ్రెస్‌లో చేరి చెన్నూర్‌ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ ఇరువురు అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ నుంచే పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలు వీరిద్దరికి కలిసిరాక ఓడిపోయారు. ఈ పరిస్థితిలో కొద్ది నెలలు గడిచిపోయాయి. లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ టికెట్‌ను సోయం ఆశించారు. అయి తే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రాథోడ్‌ రమేశ్‌ను ప్రకటించింది. దీంతో నామినేషన్ల ఘట్టం మొదలైన తర్వాత సోయం బాపురావు కాంగ్రెస్‌ పార్టీని వీడి హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ సమక్షంలో కమలం గూటికి చేరారు.

ఆ పార్టీ నుంచి ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ టికెట్‌ సాధించారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పెద్దపల్లి అభ్యర్థిగా ఎ.చంద్రశేఖర్‌ను ముందుగా ప్రకటించింది. ఇక టీఆర్‌ఎస్‌ నుంచి జి.వివేకానంద పేరు వినిపించినా అనూహ్యంగా నామినేషన్ల చివరి రోజు బొర్లకుంట వెంకటేశ్‌ నేత కాంగ్రెస్‌ నుంచి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు. వెంటనే పెద్దపల్లి పార్లమెంట్‌ టికెట్‌ కూడా ఇచ్చారు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని బోథ్‌ నియోజకవర్గం, పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలోని చెన్నూర్‌ నియోజకవర్గాలు ఉండగా, ఈ ఇరువురు నేతలకు డిసెంబర్‌లో మూసుకుపోయిన విజయం ఏప్రిల్‌లో మళ్లీ అదృష్టం తట్టింది. పార్టీ మారి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచి విజయం దక్కించుకున్నారు.

సారుప్యత..
ఈ ఇద్దరు ఎంపీలకు సారుప్యత ఉంది. ఇరువురు డిసెంబర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేశారు. కాగా సోయం బాపురావు 2004లో బోథ్‌ నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌కు సంబంధించి అప్పట్లో కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఐటీడీఏలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన పదవి విరమణ తీసుకొని ఆ ఎన్నికల్లో బరిలో నిలిచారు. బోథ్‌ ఎమ్మెల్యేగా అప్పట్లో గెలుపొందారు. అయితే అప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2008లో ఆయన తొమ్మిది మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. అయితే 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ నుంచి బోథ్‌ టికెట్‌ ఆశించినా దక్కకపోవడంతో నిరాశ చెందారు. 2014లో మరోసారి బోథ్‌ నుంచే కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించినా రాకపోవడంతో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక బొర్లకుంట వెంకటేశ్‌ నేత రవాణా శాఖలో పనిచేస్తూ పదవి విరమణ తీసుకొని డిసెంబర్‌లో చెన్నూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఓటమి పాలయ్యారు. 2019 ఏప్రిల్‌లో సోయం బీజేపీ నుంచి, బొర్లకుంట టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలిచి గెలుపొందారు.

గతం కంటే ఎక్కువే..
ఈ ఇరువురు లోక్‌సభ బరిలో నిలవగా, డిసెంబర్‌లో ఆయా నియోజకవర్గాల్లో అప్పుడు వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు అధికంగా రావడం గమనార్హం. సోయం బాపురావుకు బోథ్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో 54,639 ఓట్లు రాగా, ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో 61,003 ఓట్లు వచ్చాయి. విచిత్రమేమిటంటే సోయం బాపురావు అసెంబ్లీ ఎన్నికల్లో 6వేల ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకున్నా ఆయనకు అప్పట్లోనే విజయం దక్కే పరిస్థితి ఉండేది. ఇక వెంకటేశ్‌ నేతకు చెన్నూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 43,848 ఓట్లు వచ్చాయి. పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయనకు చెన్నూర్‌ నియోజకవర్గంలో 67,219 ఓట్లు రావడం గమనార్హం.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top