
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రాంతీయ ఉద్యమం తప్పదని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలేవీ స్థానికులకు దక్కడంలేదని, ఇక్కడి వనరుల్నిస్థానికేతరులు కొల్లగొడుతున్నారని ఆక్షేపించారు. తక్షణమే ఈ అన్యాయాలను అరికట్టకుంటే ప్రాంతీయ ఉద్యమం ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చిరంచారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉత్తరాంధ్రకు జరుగుతోన్న అన్యాయాలపై విద్యార్ధి, యువజన, ఉద్యోగసంఘాల ప్రతినిధులతో కమిటీని ఏర్పాటుచేసి, పోరాటాన్ని ప్రారంభిస్తామని, స్థానికులకే 85 శాతం ఉద్యోగాలు దక్కాలన్న ఆర్టికల్ 371( డి) అమలయ్యేదాకా గాంధేయ పద్ధతిలో ఉద్యమిస్తామని కొణతాల తెలిపారు. ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు, మేధావులు సైతం ఈ పోరాటంలో కలిసిరావాలని కోరారు.