అమెరికాలో సీఎం; ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా

Anand Singh, Ramesh Jarkiholi Resigns From Karnataka Assembly - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) సంకీర్ణ సర్కారులో మరో సంక్షోభం తలెత్తింది. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ముందుగా ఆనంద్‌ సింగ్‌ రాజీనామా చేయగా, మరికొద్ది గంటల తర్వాత మరో ఎమ్మెల్యే రమేశ్‌ జర్కయాళి కూడా ఆయన బాటలో నడిచారు. వీరిద్దరి రాజీనామాలతో కర్ణాటక అసెంబ్లీలో సంకీర్ణ సర్కారు బలం 117కి తగ్గింది. 224 స్థానాలున్న శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 113. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

విజయనగర్‌ నియోజకవర్గం నుంచి ఆనంద్‌ సింగ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తన నియోజవర్గంలోని ప్రభుత్వ భూమిని జిందాల్‌ సంస్థకు లీజుకు ఇవ్వడం పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని ఆనంద్‌ సింగ్‌ విలేకరులకు తెలిపారు. ఆనంద్‌ సింగ్‌ రాజీనామా లేఖ అందిందని స్పీకర్‌ కార్యాలయం వెల్లడించింది. రమేశ్‌ జర్కయాళి రాజీనామా లేఖను స్వీకరించేందుకు స్పీకర్‌ ఆఫీసు నిరాకరించింది. తన రాజీనామా వెనుక ఎవరి ఒత్తడి లేదని, ఇది తన సొంత నిర్ణయమని లేఖలో ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. ‘న్యూజెర్సీలో కాలభైరేశ్వర ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఉన్నాను. టీవీ చానళ్లు చూస్తున్నాను. మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు పగటి కలలుగానే మిగులుతాయ’ని ఆయన ట్వీట్‌ చేశారు. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప తెలిపారు. కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కోరుకోవడం లేదన్నారు. ఒకవేళ సంకీర్ణ సర్కారు తనంతట తాను కూలిపోతే ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తామన్నారు. ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో ఎటువంటి పొరపొచ్చాలు లేవని, ఆనంద్‌ సింగ్‌ రాజీనామా తనకు షాక్‌ కలిగించిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మంత్రి డీకే శివకుమార్‌ వ్యాఖ్యానించారు. కాగా, జనవరిలో ఈగల్‌టన్‌ రిసార్టులో కంప్లి ఎమ్మెల్యే గణేశ్‌తో జరిగిన ఘర్షణలో గాయపడిన ఆనంద్‌ సింగ్‌ ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top