కేసులున్న వారికి హోంమంత్రి పదవా?: సురవరం | Amit Shah who was convicted in six cases Says Suravaram | Sakshi
Sakshi News home page

కేసులున్న వారికి హోంమంత్రి పదవా?: సురవరం

Jun 8 2019 3:30 AM | Updated on Jun 8 2019 3:30 AM

Amit Shah who was convicted in six cases Says Suravaram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హత్య కేసుతో పాటు, ఆరు కేసుల్లో నిందితుడిగా ఉన్న అమిత్‌షాకు కేంద్ర హోంమంత్రి పదవిని ఎలా కట్టబెడతారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ప్రశ్నించారు. ఈ కేసుల్లో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణతో పాటు కోర్టులు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 8 పార్లమెంటరీ కమిటీల్లో అమిత్‌షాను సభ్యుడిగా ఎలా చేస్తారని నిలదీశారు. ఎన్ని కేసులుంటే అన్ని కమిటీల్లో చేరుస్తారేమోనని ఎద్దేవా చేశారు. శుక్రవారం మఖ్దూంభవన్‌లో పార్టీనాయకులు డా.కె.నారాయణ, అజీజ్‌పాషా, చాడ వెంకట్‌రెడ్డిలతో కలసి సురవరం విలేకరులతో మాట్లాడారు.

అద్భుతమైన జీడీపీ రేటును సాధించినట్టు నరేంద్ర మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని, వాస్తవానికి ఆ రేటు 5.5 శాతానికి పడిపోయిందని ఎద్దేవా చేశారు. నాలుగున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత ఎక్కువగా దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను, నిష్పాక్షితను, స్వయంప్రతిపత్తిని కోల్పోయి కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలుకగా మారిపోయిందని ధ్వజమెత్తారు. యూపీ, హరియాణ, బిహార్‌ తదితర రాష్ట్రాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కింపులో ఎక్కువ ఓట్లు ఉండటంపై ఈసీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ అభ్యర్థి కన్హయ్యకుమార్‌ పోటీచేసిన బెగుసరాయిలోనూ ఇదే పరిస్థితి తలెత్తిందని, దీనికి ఈసీ సరైన సమాధానం చెప్పకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.  

చంద్రబాబు విపక్షం లేకుండా చేయాలనుకున్నారు..
చంద్రబాబు ఏపీ సీఎంగా ఉండగా ప్రతిపక్షం లేకుండా చేయాలని వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించారని, అందుకే ఈ ఎన్నికల్లో బాబుకు తగిన బుద్ధి చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ పేర్కొన్నారు. చంద్రబాబు పరిస్థితిని చూసైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేర్చుకోవాలన్నారు. చంద్రబాబుకు ఏ గతి పట్టిందో తనకు అదే పరిస్థితి వచ్చే విధంగా కేసీఆర్‌ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌కు మద్దతుదారు ఎంఐఎంకు విపక్షహోదా వచ్చేలా వ్యవహరించడం సరికాదన్నారు.

రాష్ట్రంలో పెద్ద మెజారిటీతో గెలిచిన టీఆర్‌ఎస్‌కు అసెంబ్లీలో ఎలాంటి ఇబ్బందుల్లేకపోయినా సీఎల్పీ విలీన ప్రక్రియ చేపట్టడం సరికాదన్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో గవర్నర్‌ చూడలేరా, చట్టరీత్యా కాకపోయినా నైతికంగా ఇలా చేయకూడదని అధికారపార్టీకి చెప్పలేరా అని ప్రశ్నించారు. విశాఖ భూముల కుంభకోణంపై సిట్‌ ఇచ్చిన నివేదికను వెల్లడించి, ఈ వ్యవహారంలో తప్పు చేసిన వారిపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని నారాయణ విజ్ఞప్తి చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement