
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి రహస్యంగా భేటీ కావడంపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ముగ్గురు కలిసి ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ రహస్య భేటీకి చంద్రబాబు నాయుడే సూత్రధారి అని ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిమ్మగడ్డ దుర్మార్గపు మనస్తత్వం ఈ భేటీతో బయటపడిందన్నారు. (చదవండి : ఇద్దరు నేతలతో నిమ్మగడ్డ రహస్య భేటీ)
తప్పుడు పనులు చేస్తున్న నిమ్మగడ్డ తక్షణమే అరెస్టు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సుజనా, కామినేని బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పని చేస్తున్నారని విమర్శించారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంతో చంద్రబాబు ఎక్స్‌పర్ట్ అని, వాడుకొని వదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, నిమ్మగడ్డ కలిసి ప్రభుత్వంకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వ్యవస్థల్లోకి సొంత మనుషులను చొప్పించడం, ఆవ్యవస్థలను అనైతికంగా వాడుకోవడం చంద్రబాబకు బాగా అలవాటైందని మండిపడ్డారు. టీడీపీ నుంచి వచ్చిన లేఖపై నిమ్మగడ్డ రమేష్ సంతకం చేశారని ఆరోపించారు. హోటల్ భేటీలో ముగ్గురు కలిసి ఎవరితో మాట్లాడారో తెలపాలని డిమాండ్ చేశారు. ఈ ముగ్గురు నేతల భేటీపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. నిమ్మగడ్డ బండారం బయట పెట్టేందుకు ఎంత దూరమైన వెళ్తామని అంబటి పేర్కొన్నారు.
(చదవండి : నిమ్మగడ్డతో భేటీ: బీజేపీ నేతలపై అధిష్టానం ఫైర్ )