రోగాల నగరంగా మార్చారు

All party leaders comments on TRS Govt - Sakshi

అఖిల పక్ష నేతల ఆరోపణ 

ఫీవర్‌ ఆస్పత్రిని సందర్శించిన నేతలు

హైదరాబాద్‌: విశ్వనగరంగా హైదరాబాద్‌ను మారుస్తామన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవగాహనలేమితో రోగాల నగరంగా మార్చిందని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు రోగాలతో విలవిలలాడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. సీజనల్‌ వ్యాధుల కారణంగా నగరంలోని నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో శనివారం అఖిలపక్ష నేతలు ఆ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ పద్మజతో సమావేశమైన నేతలు రోగులకు అందిస్తున్న వైద్యం, సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వార్డు–2లోకి వెళ్లి రోగులను పరామర్శించారు.  

‘ఫీవర్‌’కే ఫీవర్‌: కోదండరాం 
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ధర్మాసుపత్రి గా పేరుగాంచిన ఫీవర్‌ ఆస్పత్రికే జ్వరం వచ్చినట్లుందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. విషజ్వరాల నేపథ్యంలో మంత్రులు, అధికారులు ఆస్పత్రుల సందర్శనలు, పరామర్శలతో సమస్యలు పరిష్కారం కావన్నారు. రోగుల తాకిడి దృష్ట్యా ఓపీ కౌంటర్లలో ఉన్న వైద్యులపై అధిక పని భారం పడుతోందన్నారు. దీంతో అదనపు ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేసి అందుకనుగుణంగా సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేశారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలన్నారు.  

చోద్యం చూస్తోంది: ఎల్‌.రమణ 
రాష్ట్రమంతా విషజ్వరాలతో అల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు నగరం నాలుగు దిక్కుల్లో వెయ్యి పడకల ఆస్పత్రులు నాలుగు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయలేదని ప్రశ్నించారు. రూ.కోట్లు ఖర్చు చేసి ప్రగతి భవన్‌ నిర్మించింది విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకేనన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. 

సరైన కార్యాచరణ లేదు: చాడ 
వైద్యం పట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి సరైన కార్యాచరణ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. రోగుల తాకిడి దృష్ట్యా ఫీవర్‌ ఆస్పత్రికి అదనపు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సాయిబాబా, సీపీఐ నేత అజీజ్‌ పాషా, డాక్టర్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top