ఆప్‌ సర్కార్‌కు మళ్లీ షాకిచ్చిన ఎల్జీ

AAP Govt Order Again Rejected by LG Office - Sakshi

కోర్టు తీర్పు తర్వాత కూడా ఢిల్లీ రాజకీయాల్లో మార్పు కనిపించటం లేదు. కొద్ది గంటల్లోనే ఆప్ ప్రభుత్వానికి మళ్లీ షాక్‌ తగిలింది. సర్కార్‌ జారీ చేసిన తొలి ఆర్డర్ తిరస్కరణకు గురైంది. దీంతో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తీరుపై ఆప్‌ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. 

సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం సుప్రీం కోర్టు తీర్పు అనంతరం అధికారులను బదిలీ చేసే అధికారాన్ని స్వయంగా చూసుకుంటామంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ముఖ్యమైన బదిలీల విభాగానికి లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారని చెబుతూ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌.. ఆ ఆదేశాలను తిరస్కరించింది. దీంతో అగ్గిరాజుకుంది. 

కోర్టు ధిక్కారమే.. తాజా అంశంపై మండిపడ్డ ఆప్ నేతలు, సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చిన తీర్పును సైతం కేంద్రం పక్కన బెడుతోందని విమర్శించారు. "నిన్నటి తీర్పులో కోర్టు స్పష్టంగా.. కేవలం భూమి, పోలీస్, పబ్లిక్ ఆర్డర్ విభాగాలు మాత్రమే కేంద్రం పరిధిలో ఉంటాయని, మిగతా అన్ని విషయాల్లో ప్రభుత్వ నిర్ణయం మేరకు పనులు జరగాలని చెప్పింది. అంటే బదిలీల విషయంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు ఎలాంటి అధికారం లేదు. ఆ లెక్కన కోర్టు తీర్పును వీరు ధిక్కరిస్తున్నారు" అని ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఆరోపించారు. సీఎంగా ఉన్న కేజ్రీవాల్కే బదిలీల అధికారం పూర్తిగా ఉంటుందని ఆయన అంటున్నారు. దీనిపై ఎల్జీ కార్యాలయం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

బుధవారం సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పు... ‘ఢిల్లీని పాలించాల్సింది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే. లెఫ్టినెంట్ గవర్నర్ వారధిగా ఉండాలే తప్ప ప్రతి విషయంలోనూ కలుగజేసుకుంటూ పాలనను అస్తవ్యస్థం చేయరాదు. ప్రభుత్వం తన నిర్ణయాలను ఎల్జికి తెలిపితే సరిపోతుంది. ఆమోదం అవసరం లేదు’ అని తేల్చి చెప్పింది. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌లతో కూడిన బెంచ్‌ తీర్పు వెల్లడించింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top