రైతు రాజ్యమే తెలంగాణ జెండా, ఎజెండా | Solipeta Ramalingareddy writes on TRS | Sakshi
Sakshi News home page

రైతు రాజ్యమే తెలంగాణ జెండా, ఎజెండా

Apr 27 2017 12:41 AM | Updated on Oct 22 2018 8:47 PM

రైతు రాజ్యమే తెలంగాణ జెండా, ఎజెండా - Sakshi

రైతు రాజ్యమే తెలంగాణ జెండా, ఎజెండా

14 ఏళ్ల పోరాటం ... అసాధారణ త్యాగాలు, ఆత్మబలిదానాలతో లక్ష్యం ముద్దాడిన దక్షత మనది.

సందర్భం
14 ఏళ్ల పోరాటం ... అసాధారణ త్యాగాలు, ఆత్మబలిదానాలతో లక్ష్యం ముద్దాడిన దక్షత మనది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈనెగాసి నక్కల పాలు కావద్దనే దృఢచిత్తం. తెలంగాణ కోసం బొంత పురుగునైనా ముద్దాడుతా అనే సంకల్పం. తెలంగాణ రాష్ట్ర సమితి 17 ఆవిర్భావ పండుగ వేళ  ఓరుగల్లు వేదిక  భవిష్యత్తు కర్షకుని కన్నీళ్లు తుడిచే రైతురాజ్యం తేవాలే. అది రామరాజ్యంగా మారాలె.

పల్లెకు వ్యవసాయమే జీవనాధారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మోడు వారిన జీవితాలు చిగురిస్తాయని సబ్బండ వర్ణాలు ఆశతో ఉన్నాయి. వ్యవసాయంతో పాటు దాని మీద ఆధారపడిన కులవృత్తులు బలోపేతం కావాలి. పల్లె ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిని సాధించాలి. తెలంగాణ పల్లెలో ఇప్పటికీ బోర్లు వేస్తే.. 1000 అడుగుల లోతుకు వెళ్లినా నీళ్లు రాని దుస్థితి. ఒక బోరు వేసినప్పుడు నీళ్లు రాకపోతే ఇంకో బోరు వేయ టం... ఇలా నీటి చెమ్మ కోసం 5.. 10..15 బోర్లు వేసి రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు.


కృష్ణాగోదావరి నదుల నుంచి మేజర్, మీడియం, మైనర్‌ ఇరిగేషన్‌ కలిపి తెలంగాణకు 1,071 టీఎంసీల జలాలు ఇచ్చినట్టు  ఉమ్మడి రాష్ట్ర పాలకులు నివేదికల్లో పొందుపరిచారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న సాగుభూమికి  రకరకాల లెక్కలు ఉన్నాయి. అడవులు, గ్రామ కంఠాలు పోను 1,11,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి. మరి 1,071 టీఎంసీల కేటాయింపులు చేస్తే కోటి ఎకరాల మాగాణి నీళ్లెందుకు పారలేదనేది బేతాళ ప్రశ్న. ఇప్పుడు వాటా జలాలను సంపూర్ణంగా మన బీడు భూముల్లోకి మళ్లించడమే మన ముందున్న లక్ష్యం.

కృష్ణాగోదావరి  నదులపై 23 పెద్ద, మధ్య తరగతి జల ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం  రూపకల్పన చేసింది. ఇందులో కీలకమైనదే  కాళేశ్వరం ప్రాజెక్టు. తక్కువ భూమి, అతి తక్కువ ముంపు నష్టంతో  ఎక్కువ నీటిని నిల్వ చేసే లక్ష్యంతో ప్రాణహితకు పునఃర్జీవం పోసి కాళేశ్వరం రీడిజైన్‌ జరిగింది. ఇలా రూపొం దించిన ప్రాజెక్టులో భాగమే కొమురవెల్లి మల్లన్న సాగర్‌. మేడిగడ్డ బ్యారేజీ నుంచి టన్నెల్‌ ద్వారా నీళ్లను తరలించి 50 టీఎంసీలతో మల్లన్న సాగర్‌ను నింపే ప్రయత్నం జరుగుతోంది. మొత్తం దాదాపు 18.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం జరుగుతోంది.

తెలంగాణలో 25 వేల మెగావాట్ల  విద్యుత్తు ఉత్పత్తికి వనరులు అనుకూలంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు రూ 90 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టులు వేగంగా పూర్తి కావటానికి ఓరుగల్లు వేదికగా మనమంతా పునరంకితం కావాలె. రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల చెరువులను, కుంటలను పునర్నిర్మాణం చేసే మహా యజ్ఞం చేపట్టారు. మిషన్‌ కాకతీయతో చెరువుల్లో, భూగర్భ జలాలతో కలిపి 500 టీఎంసీల నీళ్లు  నిల్వ చేసినట్టే అని జాతీయ పరిశోధక సంస్థలు వెల్లడించాయి.  మెత్తానికి అంపశయ్య మీదున్న రైతుకు ఊపిర్లు ఊది, కొత్త జవసత్వాలను నింపి మళ్లీ  పొలం మీదకు పంపే మహా ప్రయోగశాలగా ఓరుగల్లు  వేదిక కాబోతోంది.


(నేడు తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా)
వ్యాసకర్త దుబ్బాక ఎమ్మెల్యే ‘ 94403 80141
సోలిపేట రామలింగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement