ఆర్థికాంశాలకే అగ్రతాంబూలం

కె.రామచంద్రమూర్తి, ఎడిటోరియల్ డైరెక్టర్, సాక్షి - Sakshi


 త్రికాలమ్

  డిజైన్ దగ్గర నుంచి నిర్మాణం దాకా విదేశాలకూ, ఆ దేశాలు సూచించే విదేశీ సంస్థలకూ అప్పగిస్తే ప్రభుత్వం ఏమి చేస్తుంది? రైతుల నుంచి పంటభూములు సేకరించి విదేశీ సంస్థలకు అప్పగిస్తుందా? సింగపూర్‌ను కృష్ణా, గుంటూరు జిల్లాలకు దిగుమతి చేసుకొని మనం సేవారంగానికే (సర్వీసు సెక్టర్)కే పరిమితం అవుతామా?

 

 ఆర్థికాంశాల ప్రాధాన్యం గుర్తించిన రాజకీయవేత్తలదే  భవిష్యత్తు. అరకొర సంక్షేమ కార్యక్రమాలూ, లేని ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లూ, కల్లబొల్లి కబుర్లకూ కాలం చెల్లింది. ఉచితాలను ప్రస్తావించకుండా, అభివృద్ధి, సుపరిపాలన హామీలతోనే ఎన్నికల ప్రచారం ప్రభంజన సదృశంగా నిర్వ హించిన నరేంద్రమోదీని ప్రజలు అందలం ఎక్కించారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మతప్రాతి పదికన జరిగిన హింసాకాండకు సంబంధించి, సంఘ్ పరి వార్ గురించి ఎన్ని భయసందేహాలు ఉన్నప్పటికీ వాటన్ని టినీ పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు సమాజంలోని అన్ని తరగతుల వారూ, అన్ని కులాలవారూ ఓట్లు వేయడానికి ప్రధాన కారణం మోదీ పాలనలో అభివృద్ధి సాధించగలమనే ఆశ.

 

 కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్ అరవింద్ కేజ్రీవాల్ కంటే మొన్ననే భాజపాలో చేరిన కిరణ్‌బేదీ వైపు మొగ్గడానికీ, కేజ్రీవాల్‌కు పోటీగా బేదీని రంగంలోకి దించడం భాజపా ప్రయోగించిన బ్రహ్మాస్త్రం అని అభినందించడానికీ కార ణం కేజ్రీవాల్ హామీ ఇస్తున్న ఉచితాలతో ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేస్తాడేమోనన్న భయమే. ప్రజాప్రయోజన వ్యాజ్యాలతో సీబీఐ డెరైక్టర్లనూ, కేంద్రమంత్రులనూ, కార్పొ రేట్ దిగ్గజాలనూ గజగజ లాడిస్తున్న ప్రశాంత్ భూషణ్ తండ్రి శాంతిభూషణ్. ఈ కుటుంబం కేజ్రీవాల్ నెలకొల్పిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ)కి కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. ముఖ్యమంత్రి పదవిని 49 రోజుల తర్వాత వదిలివేసినందుకూ, సార్వత్రిక ఎన్నికలలో ఢిల్లీలోని ఏడు స్థానాలలో ఒక్కదానినీ గెలవలేకపోయినందుకూ సీనియర్ భూషణ్ ఆగ్రహించారు. ప్రశాంత్ భూషణ్ ఇప్పటికీ కేజ్రీవాల్‌ను నేరుగా విమర్శించడం లేదు. కానీ ఎన్నికలలో ఏఏపీ తరఫున ప్రచారం చేయడం లేదు. న్యాయంగా, ధర్మంగా డబ్బు సంపాదించాలని వాదించేవారూ, అక్రమార్కుల గుండెల్లో నిద్రించేవారూ, మానవ హక్కుల కోసం తెగించి పోరాడేవారూ ఈ సుప్రసిద్ధ న్యాయవాదులు.

 

 ప్రత్యామ్నాయ నమూనా ఏది?

 ఆత్మవిమర్శ వ్యక్తులకైనా, రాజకీయ పార్టీలకైనా ఆరోగ్యదాయకమే. రాష్ట్రంలోని పది వామపక్షాల అగ్రనాయకులూ శ్రేయోభిలాషులను ఆహ్వానించి తమ పార్టీలు చేసిన పొరపాట్లు ఏమిటో చెప్పమన్నారు. సీపీఎం మహాసభలు జరగబోతున్న కారణంగా సంపాదకులను పిలిపించుకొని సలహాలు చెప్పవలసిందిగా సీపీఎం నాయకులు అడి గారు. రెండు సందర్భాలలోనూ నేను ఒకే విషయం చెప్పాను. సంపద సృష్టించడానికి మన్మోహన్, మోదీలకు తెలిసిన విపణి నియంత్రిత నమూనాకు ప్రత్యామ్నాయ నమూ నా ఏదైనా సిద్ధం చేసుకోవాలి. పశ్చిమబెంగాల్‌లో మూడు దశాబ్దాలకు పైగా అధికా రంలో ఉన్న వామపక్ష సంఘటన ప్రభుత్వం సాఫల్యవైఫల్యాలను సమీక్షించుకొని వాటి నుంచి సరైన గుణపాఠాలు నేర్చుకోవాలి. సీపీఎం తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముక్తాయింపు చె ప్పారు. పశ్చిమబెంగాల్‌లో అధికార వికేంద్రీకరణ చేశామనీ, భూములు పంచామనీ, పంచాయితీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశామనీ అన్నారు. కానీ ఆర్థికాభివృద్ధికి తాము ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పలేదు. మార్కెట్ ఎకానమీకి, ప్రపంచ బ్యాంకు నమూనాకి ప్రత్యామ్నాయంగా సంపద సృష్టించడానికీ, ఆర్థికాభివృద్ధి సాధించడానికీ ఏదైనా నమూనాను సీపీఎం నాయకత్వం కానీ వామపక్ష సంఘటన కానీ రూపొందించిందో లేదో తెలియదు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రాక సందర్భంగా నిరసన ప్రదర్శనలు చేసినంత మాత్రాన ప్రజల విశ్వాసం సంపాదించలేరు. ఆర్థికాభివృద్ధి సాధించడానికి వామపక్షాల దగ్గర కానీ కేజ్రీవాల్ దగ్గర కానీ ఎటువంటి వ్యూహం ఉన్నదో తెలిసినప్పుడే, ఆ వ్యూహంపైన చర్చ జరిగి నమ్మకం కుదిరినప్పుడే ప్రజలు వామపక్షాలకు, లేదా ఏఏపీకి మళ్ళీ సానుకూలత ప్రదర్శిస్తారు. మతత త్త్వం మంచిది కాదని ప్రజలకు తెలుసు. సాక్షిమహారాజ్ ఉద్బోధలు అనారోగ్యకరమైనవనే అవగాహనా ఉంది. మోదీతో పాటు సాధువుల, సాధ్వీమణుల విపరీత ధోరణులను భరించవలసి వస్తుందని కూడా ప్రజలకు తెలియక పోలేదు. అయినా సరే మోదీ నాయకత్వానికి ఆమోదం తెలిపింది ఆయన నాయకత్వంలో దేశంలో ఆర్థికాభివృద్ధి జరుగుతుందనీ, పేదరికం తొలుగు తుందనీ, ఉద్యోగాలు వస్తాయనే విశ్వాసంతోనే.

 

 చంద్రబాబు నాయుడు ఉబలాటం

 ఈ సూత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకూ తెలుసు. రాజకీయా లలో దృశ్య ప్రాధాన్యంపైన కూడా బాబుకు అంచనా ఉన్నది. మనం నిజంగా ఏమిటో అన్నదాని కంటే మనం ఏమిటని ప్రజలు అనుకుంటున్నారనేది రాజకీయాలలో ముఖ్య మని ఆయన ఎన్నడో గుర్తించారు. మోదీ హామీ ఇవ్వడానికి సంకోచించిన ఉచితాలను బాబు సార్వత్రిక ఎన్నికలలో ఉదారంగా వాగ్దానం చేశారు. అమలు సాధ్యం కాదని తెలిసి కూడా వంద శాతం అమలు చేస్తానని ఎన్నికల ముందూ తర్వాత కూడా దబాయి స్తున్నారు. సంక్షేమ పథకాల హామీపైన ఎన్నికలలో గెలిచినప్పటికీ తన నిజస్వభావానికి తగినట్టు ఆయన విపణి నియంత్రిత ఆర్థిక వ్యవస్థలో ముందు వరుసలో పరుగులు తీయాలని ఉబలాట పడుతున్నారు. లోగడ కూడా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఢిల్లీ వచ్చినప్పుడు విశ్వప్రయత్నం చేసి పది నిమిషాలు ఇంటర్వ్యూ సంపాదించి కలుసుకున్నారు. పదేళ్ళ తర్వాత మళ్లీ దావోస్‌లో తారసపడిన గేట్స్‌ని కలుసుకొని రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ పరిశోధన కేంద్రం నెలకొల్పవలసిందిగా కోరారు. పదేళ్ల తర్వాత కలుసుకున్న బాబును చూసి బిల్‌గేట్స్ ఉద్వేగం చెందినట్టు రాయడానికి మిత్రపత్రికలు ఉన్నాయి. అవి అతిశయోక్తులు రాయడానికి అవసరమైన దృశ్యాన్ని సృష్టించే తెలివి తేటలూ, యంత్రాంగం చంద్రబాబునాయుడికి ఉన్నాయి. ఆయన పనితీరులో ఇది భాగం. దావోస్‌లో ప్రతి సంవత్సరం జరిగే సంపన్న దేశాధినేతల శిఖరాగ్ర సభకు హాజ రుకావడమే ఆర్థికవేత్తగా గుర్తింపు తెచ్చే అంశంగా చంద్రబాబునాయుడు పరిగణిస్తారు. మోదీ వలెనే తానూ ఆర్థిక సంస్కరణలకు అనుకూలుడనీ, సంపద సృష్టించడానికి ఎంత దూరమైనా వెడతాననీ చెప్పడం ఉద్దేశం. ఆ దిశగా తాను కృషి చేస్తున్నట్టు సంకేతాలు పంపడం కూడా అధికార రాజకీయాలలో భాగమే. అక్కడ కలుసుకున్నదీ భారత పారిశ్రామిక వేత్తలనే కావచ్చు. కానీ అందరినీ కలుసుకోవడానికి అది మంచి వేదిక. ఈ కారణంగానే ఒబామా గౌరవార్థం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇవ్వబోయే విందులో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళబోతు న్నారని వార్త వచ్చింది. ఒబామాతో చంద్రబాబు నాయుడు కరచాలనం చేస్తున్న దృశ్యం కనుక సృష్టించగలిగితే, ఆ దృశ్యంలో ప్రధాని, రాష్ట్రపతి కూడా ఉండేట్టు చూసుకోగలిగితే దానికి చాలా విలువ ఉంటుంది. ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను పెంపొందిం చేందుకు ఇటువంటి దృశ్యాలు దోహదం చేస్తాయి. అందుకే ఇతర ముఖ్యమంత్రులు ఊహించని విధంగా చంద్రబాబునాయుడు చొరవ తీసుకొని ముందుకు వెడతారు.

 

 ఆర్థిక విధానాలలో స్పష్టతే ప్రధానం

 ఈ ప్రయత్నం సార్థకం కావాలంటే, సంపద సృష్టి జరగాలంటే ఆర్థిక విధానాల విష యంలో స్పష్టత ఉండాలి. పరివారం కోసమో, ఆశ్రీత పెట్టుబడిదారుల కోసమో ఆర్థిక వ్యూహాలు రచించకూడదు. తాజమహల్, చార్మినార్, కుతుబ్‌మీనార్, భాక్రానంగల్, నాగార్జునసాగర్, సర్దార్ సరోవర్ వంటి బ్రహ్మాండమైన కట్టడాలనూ, ప్రాజెక్టులనూ నిర్మించిన ఇంజనీర్లూ, కాంట్రాక్టర్లూ ఈ దేశంవారే. వారి వారసులు ఇప్పుడూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి డిజైన్ సింగపూర్ ప్రభుత్వం ఇస్తుందనీ, నిర్మా ణంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా నిర్మాణ సంస్థలు పాల్గొంటాయనీ, జపాన్ ఇందుకు సాయం చేస్తుందనీ దావోస్‌లో ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది విన్న ప్రపంచాధినేతలకు కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ చంద్రబాబునాయుడి పట్ల, ఆయన ఏలుతున్న రాష్ట్రం పట్ల సద్భావం కలుగుతుందా? గౌరవం పెరుగుతుందా?

 

 ఇక్కడి వారు అనర్హులా?

 కులీ కుతుబ్ షా చార్మినార్ నిర్మించడానికి పర్షియా నుంచి కొందరు నిపుణులకు రప్పించుకున్నాడు కానీ నిర్మాణం చేసింది స్థానిక ఇంజనీర్లే. ఒమాబా సందర్శించలేక పోతున్న తాజమహల్ నిర్మాణంలో కూడా షాజహాన్ పర్షియా నుంచీ మధ్య ఆసియా నుంచీ వాస్తుశిల్ప ప్రవీణులకు పిలిపించుకొని రూపురేఖలు ఖరారు చేయించుకున్నారు కానీ పదహారేళ్ళు సాగిన నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేసినవారూ, పర్యవేక్షించిన వారూ భారతీయులే. ఢిల్లీ నిర్మాణానికి డిజైన్ ఇచ్చినవారు బ్రిటిష్ పౌరులైన ఎడ్విన్ లూట్యేన్, హెర్జర్ట్ బేకర్ కావచ్చు కానీ భవనాలు నిర్మించింది ప్రఖ్యాత జర్నలిస్టు, రచ యిత కుష్వంత్ సింగ్ తండ్రి సోహన్ సింగ్. హైదరాబాద్‌లో, ఢిల్లీలో, ముంబైలో అధు నాతన విమానాశ్రయాలు నిర్మించిన కాంట్రాక్టర్లు తెలుగు తేజాలే. నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి బహుళార్థసాధక ప్రాజెక్టులను నిర్మించిన సమర్థులైన ఇంజనీర్లు ఉన్నా రు. ఇతర దేశాలలో ఆకాశహర్మ్యాల నిర్మాణంలో పాల్గొన్న తెలుగువారూ, భారతీయు లూ చాలా మంది ఉన్నారు. వీరందరినీ కాదని రాజధానిలో సచివాలయం, రాజభవన్, హైకోర్టూ, ఇతర భవనాలూ, రోడ్లూ, ఈతకొలనులూ వంటి నిర్మాణాలకు విదేశాలకు చెందిన నిర్మాణ సంస్థల అవసరం ఉన్నదా? డిజైన్ దగ్గర నుంచి నిర్మాణం దాకా విదేశా లకూ, ఆ దేశాలు సూచించే విదేశీ సంస్థలకూ అప్పగిస్తే ప్రభుత్వం ఏమి చేస్తుంది? రైతుల నుంచి పంటభూములు సేకరించి విదేశీ సంస్థలకు అప్పగిస్తుందా? సింగ పూర్‌ను కృష్ణా, గుంటూరు జిల్లాలకు దిగుమతి చేసుకొని మనం సేవారంగానికే (సర్వీసు సెక్టర్)కే పరిమితం అవుతామా?

 

 దిగువ, మధ్య తరగతి వారి ప్రమేయం ఎక్కడ!

 ఇటీవల విజయవాడలో ఒక ప్రముఖ వైద్యుడిని కలుసుకున్నప్పుడు ఆయన ఒక ఆశ్చ ర్యకరమైన విషయం చెప్పారు. తన కుటుంబ సభ్యులందరినీ కూర్చొబెట్టి ఇక మీదట ఐదేళ్ళ వరకూ నరేంద్రమోదీ ఏమి చేసినా, చంద్రబాబునాయుడు ఏమి చేసినా ప్రశ్నిం చవద్దని ఆయన ఆదేశించారట. సమర్థుడైన వైద్యుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కూడా ఈ నిర్ణయానికి రావడానికి కారణం ఏమిటంటే మన ఇంజనీర్ల మీద, మన కాంట్రాక్టర్ల మీద, మన దేశం మీద బొత్తిగా నమ్మకం లేకపోవడం. సింగపూర్ మీద, జపాన్ మీద, అమెరికా మీద విపరీతంగా వ్యామోహం ఉండటం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడి ఆత్మగౌరవ నినాదానికి ఇది పూర్తిగా విరుద్ధం. ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను సమాజం తయారు చేసుకోనంత కాలం మోదీ, చంద్రబాబునాయుడు వంటి రాజకీయ నాయకులే పేదలకూ, దిగువ మధ్య తరగతికీ ప్రమేయం లేని విధానాలను నిర్దయగా అమలు చేస్తారు. ప్రత్యామ్నాయ నమూనా సిద్ధం కానంత వరకూ ప్రత్యామ్నాయ రాజకీయాలకీ జనాదరణ ఉండబోదు.

murthykondubhatla@gmail.com

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top