పెద్ది సాంబశివరావుకు డల్లాస్‌లో ఘన సన్మానం

Indian American Friendship Council honours Peddi Sambashiva rao - Sakshi

డల్లాస్‌ : తెలుగు భాష పరిరక్షణకు చేస్తున్న సేవలకుగానూ గుంటూరుకి చెందిన బహు భాషా నిఘంటువుల నిర్మాత పెద్ది సాంబశివరావుని ‘ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్’ డల్లాస్‌లో ఘనంగా సత్కరించింది. వైద్య ఆరోగ్య శాఖలో పదవీ విరమణ చేసిన తర్వాత 75 ఏళ్ల వయస్సులో వీరు 50 నిఘంటువులను కూర్చి రికార్డు నెలకొల్పారు. వీటిలో కొన్నిటిని ఇంటర్‌నెట్‌లో ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవటానికి వీలుగా ఉంచారు. మరి కొన్నిటిని ప్రముఖ సంస్థలు ప్రచురించాయి. ఆయన తన కృషిని ఇంతటితో ఆపకుండా అరచేతిలో అర్థాలమూట అన్నట్లుగా 16,000 తెలుగు మాటలకు ఇంగ్లీష్, హిందీ అర్థాలు ఇచ్చే ఆండ్రాయిడ్ యాప్‌ను తయారు చేశారు. వి. ఫణి కిరణ్ సాంకేతిక సహకారంతో రూపొందిన ఈ యాప్ ను గురించి ‘ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్’  అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర వివరించారు.

యాప్‌ను ఆవిష్కరించిన డాక్టర్. రాఘవేంద్ర ప్రసాద్, సాంబశివరావు కృషిని ఆయన వ్యక్తిత్వ విశిష్టతను ప్రశంసించారు. దేశ సమైక్యతకు భాషల పదకోశాలు అవసరమన్నారు. 7 సంవత్సరాల తన నిఘంటువు నిర్మాణ కృషిని, తాను చేసిన అన్నమాచార్య సాహిత్యం గురించి సాంబశివరావు వివరించి శ్రోతల సందేహాలకు సమాధానాలు చెప్పారు. ‘ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం’  ఉత్తరాధ్యక్షుడు చిన సత్యం వీర్నపు“తెలుగు – సంస్కృతం” నిఘంటువును ఆవిష్కరించగా, డాక్టర్. భానుమతి ఇవటూరి “సంస్కృతం - తెలుగు” నిఘంటువును ఆవిష్కరించారు. సభ చివరిలో యాప్ నిర్మాత పెద్ది సాంబశివరావుని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చెన్నుపాటి కృష్ణ మోహన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top