డల్లాస్‌లో మహాత్మా గాంధీకి ఘన నివాళి

Floral Tribute to Gandhiji in Dallas - Sakshi

డల్లాస్‌, టెక్సాస్ : మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డల్లాస్‌లో జాతిపితకి ఘనంగా నివాళులు అర్పించారు. ఎంతో మంది ప్రవాస భారతీయులు డల్లాస్‌ (ఇర్వింగ్) లోని  మహాత్మా గాంధీ మెమోరియల్‌ని సందర్శించి జాతిపిత 70వ వర్ధంతిని పురస్కరించుకుని మహాత్మా గాంధీ పాదాల వద్ద పుష్పాలను ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీజీకి ఇష్టమైన రఘుపతి రాఘవ రాజారామ్ కీర్తనను స్థానిక గాయకుడు ఎస్ పి నాగ్రాత్ ఆలపించారు.

మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వల మాట్లాడుతూ స్థానిక ప్రజల సహకారంతో అతి పెద్ద గాంధీ మెమోరియల్ ను ఇక్కడ నిర్మించుకోవడం, భావితరాలకు  స్పూర్తిదాయకంగా చూపడానికి అవకాశం కలిగిందని, గాంధీజీ సేవలను స్మరించుకోవడానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ గాంధీజీ 70 సంవత్సరాల కిందట మరణించినా ఆయన సిద్ధాంతాలు, ఆశయాలతో మనందరి మధ్య ఎప్పటికీ సజీవంగానే ఉంటారని అన్నారు. దేశ స్వాతంత్ర కోసం దాదాపు 32 సంవత్సరాల తన జీవతాన్ని అంకితం చేసి లక్షలాది ప్రజలను నిరంతరం చైతన్య పరచి, అహింసా మార్గం ద్వారా దేశానికి స్వాతంత్రం సాధించిన తీరు అనితర సాధ్యం అని పేర్కొన్నారు. ప్రవాస భారతీయులుగా మనమందరం గాంధీ చూపిన బాటలో పయనిస్తూ సమానత్వం, సామాజిక న్యాయం ఉండే ఒక మంచి సమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గాంధీజీ విశ్వ మానవాళికి ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తి అని, ఆయన సిద్ధాంతాలతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఉత్తేజితులయ్యారని గాంధీ మెమోరియల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ కమల్ కౌషల్ అన్నారు. గాంధీజీ శాంతి, సహనానికి ప్రతి రూపమని, ఆయన గురించి ముఖ్యంగా యువతరం ఎంతో తెలుసుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చని ఐఏఎన్టి ఉపాధ్యక్షులు బిఎన్ చెప్పారు. గాంధీజీ తన సాధారణ, పారదర్శక జీవితంతో ఎంతో మందికి ఆదర్శప్రాయులయ్యారని, ఆయనకు మరణం లేదని ఎన్ని దశాబ్దాలైనా అందరూ జాతిపితను గుర్తించుకుంటారని మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ షబ్నమ్ మోద్గిల్ చెప్పారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top