గ్రేట్‌ సీఎం.. వారిపై యోగి కార్యాలయం ట్వీట్‌

Yogi Adityanath Office Tweet Says Every Violent Rioter In Shock Now - Sakshi

ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కార్యాలయం ట్వీట్‌

లక్నో: పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీసుకుంటున్న చర్యలను ఆయన కార్యాలయం సమర్థించుకుంది. ఆందోళనల్లో హింసకు పాల్పడుతున్న వారిపై యోగి ఉక్కుపాదం మోపి.. వాళ్లను విస్తుపోయేలా చేస్తున్నారని ప్రశసించింది. ఈ మేరకు... ‘హాని తలపెట్టాలనుకున్న ప్రతీ ఒక్కరు షాక్‌ అవుతున్నారు. అల్లరి చేయాలనుకున్న వాళ్లంతా విస్తుపోతున్నారు. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలకు భయపడి వారు సైలెంట్‌ అయిపోయారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారు నష్ట పరిహారం చెల్లించాలని సీఎం ఆదేశించారు. హింసకు పాల్పడ్డ ప్రతీ ఒక్క నిరసనకారుడు ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరుగా పరిహారం చెల్లిస్తున్నారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లో ఉన్నది యోగి ప్రభుత్వం. గ్రేట్‌ సీఎం యోగి’ అని యోగి ఆదిత్యనాథ్‌ కార్యాలయం ట్వీట్‌ చేసింది.(క్షమించండి: రూ. 6 లక్షలు తీసుకోండి! )

అదే విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో శాంతియుత వాతావరణ నెలకొందని సీఎం కార్యాలయం ట్విటర్‌లో పేర్కొంది. కాగా సీఏఏకు వ్యతిరేకంగా యూపీలో జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా చెలరేగిన హింసలో ఇప్పటికే దాదాపు 21 మంది మరణించారు. ఎంతో మంది బుల్లెట్‌ గాయాలతో మరణించారని నిరసనకారులు ఆరోపిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం పోలీసులు కాల్పులు జరపలేదని పేర్కొంది. ఇక ఆందోళనల్లో హింసకు పాల్పడి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారు నష్ట పరిహారం చెల్లించాలని యోగి సర్కారు పలువురికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.(పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?)

ఈ క్రమంలో దాదాపు 498 మందిని హింసకు పాల్పడినట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. వీరిలో అత్యధికంగా మీరట్‌ నుంచి 148 మంది ఉన్నారని.. వీరందరినీ నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొన్నారు. మరోవైపు.. పశ్చిమ యూపీలోని బులంద్‌షహర్‌లో గత శుక్రవారం చెలరేగిన అల్లర్లలో జరిగిన నష్టానికి చింతిస్తూ ముస్లిం సోదరులు... రూ. 6.27 లక్షల చెక్కును ప్రభుత్వ అధికారులకు అందజేశారు. ఇదిలా ఉండగా... రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో.. యూపీ పోలీసు చీఫ్‌ వివరణ కోరుతూ.. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. 

పౌరసత్వ సవరణ చట్టం: వరుస కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top