చిన్నాచితకా ఉద్యోగాలతో సరి | Women Employees Facing Problem With Transportation | Sakshi
Sakshi News home page

చిన్నాచితకా ఉద్యోగాలతో సరి

Apr 9 2018 9:54 PM | Updated on Apr 9 2018 9:54 PM

Women Employees Facing Problem With Transportation - Sakshi

మనదేశంలోని  నగరాల్లో నివసిస్తోన్న మహిళల ఉద్యోగాలపై రవాణా సదుపాయాల లేమి ప్రభావం చూపుతోందని ముంబైలో జరిపిన తాజా పరిశోధనలు తేల్చి చెప్పాయి. సరైన రవాణా సదుపాయాలు లేకపోవడం వల్ల వారు మెరుగైన ఉద్యోగావకాశాలను కోల్పోవాల్సి వస్తోందని ఈ పరిశీలనలో వెల్లడైంది. దూరప్రయాణాలకు అనువైన రవాణా సౌకర్యాలు కరువై, తాము నివసిస్తోన్న ప్రాంతాల్లోనే తక్కువ వేతనాలు వచ్చే చిన్నా చితకా ఉద్యోగాలతో మహిళలు సరిపెట్టుకుంటున్నారని  ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ(ఐటిడిఎస్‌) సంస్థ అధ్యయనంలో తేలింది. గత రెండు దశాబ్దాలతో పోలిస్తే 2013లో శ్రామిక మహిళల భాగస్వామ్యం  కూడా 34.8 శాతం నుంచి 27 శాతానికి దిగజారినట్టు ఇండియా స్పెండ్‌ నివేదిక ఇటీవల వెల్లడించింది.

వ్యాపార, ఆర్థిక పరిశోధనా సంస్థ  మెకెన్సీ గ్లోబల్‌  ఇనిస్టిట్యూట్‌ 2015 నివేదిక ప్రకారం హిమాచల్‌ ప్రదేశ్‌లో 63 శాతం మంది శ్రామిక మహిళలు ఉంటే, బీహార్‌కి వచ్చేసరికి అది 9 శాతానికి పడిపోయింది. 2017 ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2004 నుంచి 2011–12 లోపల 19.2 మిలియన్ల మంది శ్రామిక మహిళలు తగ్గిపోయారు. ఎఫ్‌ఐఏ ఫౌండేషన్‌ గతంలో నిర్వహించిన çసర్వే ప్రకారం పురుషుల కంటే మహిళలే అధికంగా ప్రభుత్వ రవాణా వ్యవస్థపై ఆధారపడుతున్నట్టు తేలింది. ప్రధానంగా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి, నగర ప్రాంతాల్లో నివసిస్తోన్న కుటుంబాల్లో పురుషులు 27 శాతం మంది, స్త్రీలు 37 శాతం మంది పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌నే ఎంచుకుంటున్నట్టు ఓ రిపోర్టు వెల్లడించింది. అయితే తక్కువ ఖర్చు, భద్రత కారణాల రీత్యా మహిళలు ప్రభుత్వ రవాణావైపు మొగ్గుచూపుతున్నారని కూడా ఇందులో వెల్లడైంది. 

2010 లో జగోరి అనే మహిళా రీసోర్స్‌ సెంటర్‌ యుఎన్‌ వుమన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఢిల్లీలో సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో దాదాపు 90 శాతం మంది స్త్రీలు ఏదో రకమైన వేధింపులకు గురైనట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు  51 శాతం మంది వేధింపులకు గురయ్యామనీ,  బస్సుల కోసమో, లేక రైళ్ళకోసమో వేచిచూస్తున్న సమయంలో 42 శాతం మంది వేధింపులకు గురైనట్టు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement