పెట్రో వినియోగదారులే భారాన్ని మోయాలా?

పెట్రో వినియోగదారులే భారాన్ని మోయాలా?


సాక్షి, హైదరాబాద్‌: మధ్య తరగతి నడ్డి విరిచేలా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ పోతున్న కేంద్ర ప్రభుత్వం ఆ ఆదాయాన్ని ప్రాజెక్టులపై పెడతామనటం సబబుకాదని కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ జైపాల్‌రెడ్డి అన్నారు. పెట్రో వినియోగదారులు మాత్రమే ఆ భారాన్ని ఎందుకు మోయాలని ప్రశ్నించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు పెరిగిన సమయాల్లో దాదాపు రూ.1.2 లక్షల కోట్లు సబ్సిడీగా ఇచ్చామని, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కేవలం రూ.40వేల కోట్ల సబ్సిడీ ఇస్తోందన్నారు.



సబ్సిడీని ఆదా చేస్తున్న ప్రభుత్వం.. ఆదాయాన్ని పెంచుకుంటూ పోతోందని చెప్పారు. చాలా మధ్యతరగతి కుటుంబాలకు స్కూటర్‌, చిన్న కారు వంటి వాహనాలు మాత్రమే ఉన్నాయని.. పెట్రో ధరల కారణంగా వాటి యజమానులపై భారం పడుతోందన్నారు. అంతర్జాతీయంగా పెట్రో ధరలు తగ్గినప్పటికీ ఆ ప్రభావం దేశంలో కనిపించకుండా పోతోందన్నారు. పెట్రో ధరలను తగ్గించి సగటు పౌరుడి కష్టాలను తగ్గించాలని కోరారు. దేశంలో రైళ్లు, రోడ్లు, వంతెనలు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి వసతుల కల్పనకు పెద్ద ఎత్తున అవసరమైన నిధులను పెట్రో ఆదాయం నుంచే ఖర్చు చేస్తున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారని గుర్తు చేశారు.



పెట్రోలియం ఉత్పతులను కూడా జీఎస్టీలోకి తీసుకురావటమే దీనికి పరిష్కారమని జైపాల్‌రెడ్డి అన్నారు. అయితే, దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా లేవని తెలిపారు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. దీనికి బదులుగా అనేక రాష్ట్రాలు పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్‌ విధిస్తూ ఆదాయాన్ని పెంచుకుంటున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ధరల పెంపును ప్రధాన ఆదాయ మార్గంగా మలుచుకున్నాయని ఆరోపించారు. అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు తక్కువగా ఉన్న సమయంలోనూ ఎక్సైజ్‌ డ్యూటీ విపరీతంగా పెంచి కేవలం ఆదాయ పెంపుపైనే కేంద్రం దృష్టి పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదని జైపాల్‌రెడ్డి అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top