ఎందుకు ఈసారి భారీ వర్షాలు ?

Why This Much Rainfall Brings Floods to many states in India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ‘సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌’ ఆగస్టు ఒకటవ తేదీన విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం దేశంలోని రిజర్వాయర్లన్నీ సాధారణ స్థాయి నీటి మట్టానికి 80 శాతం నీటితో నిండాయి. ఆ తర్వాత రెండు వారాల్లోనే అంటే ఆగస్టు 14వ తేదీన విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం రిజర్వాయర్లన్నీ సాధారణ స్థాయిని దాటి 125 శాతానికి చేరుకున్నాయి. అంటే సాధారణ స్థాయికన్నా 25 శాతం ఎక్కువ. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల రిజర్వాయర్లలోకి నీళ్లు ఎక్కువగా వచ్చి చేరాయి. 

సాధారణంగా మంచి వర్షాలు కురుస్తున్నప్పుడు సెప్టెంబర్‌ నెలలో ఇలా దేశంలోని రిజర్వాయర్లన్నింటిలో జలకళ కనిపిస్తోంది. అందుకు విరుద్ధంగా ఆగస్టు నెలలోనే ఇప్పుడు ఆ జలకళ ఆవిష్కతమయింది. ఈ నీటిని సద్వినియోగంగా వాడితే వచ్చే ఏడాది వర్షాలు లేకపోయినా నీటి అవసరాలు తీరిపోతాయి. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు రావడం వల్ల దేశంలోని రిజర్వాయర్లు ఎక్కువగా నిండాయి. గోదావరి నదిపైనున్న జయక్‌వాడి రిజర్వాయర్‌ 92 శాతం నిండింది. అంతగా జలకళ కనిపించని తాపీ నదిపైనున్న ఉకాయ్‌ రిజర్వాయర్‌ కూడా ఈసారి 78 శాతం నిండాయి. 

ఎగువ కురిసిన వర్షాల వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాషం బ్యారేజీలన్నీ నిండాయి. దాంతో కొంత నీటిని సముద్రంలోకి వదలక తప్ప లేదు. కేరళలో అధిక వర్షాల వల్ల వరదలు వచ్చి ఈసారి కూడా 496 మంది మరణించడం విషాదకరం. 2018లో సంభవించిన వరదల్లో తీవ్రంగా నష్టపోయిన కేరళ తేరుకోక ముందే మళ్లీ వర్షాలు,  వరదలు ముంచెత్తడం దురదష్టకరం. గతేడాది సంభవించిన వరదల్లో కేరళలో ఒక లక్ష హెక్టార్లలో పంట నష్టం వాటిల్లగా, ఆరున్నర లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు రెండువేల మంది మరణించారు. వర్షాలు, వరదలు కారణంగా కేరళకు 5,597 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు నిపుణుల లెక్కలు తెలియజేస్తున్నాయి. ఈసారి కూడా ఆ రాష్ట్రంలో నష్టం భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

ఇలా అనూహ్యంగా వర్షాలు,  వరదలు పెరగడానికి కారణాలు ఏమిటీ ? భూతాపోన్నతి అంటే భూమిని ఆవహించిన వాతావరణం వేడెక్కడం వల్ల వర్షాలు పెరిగాయి. 1901 నుంచి 1910 మధ్య ఉన్న భూ వాతావరణంతో పోలిస్తే 2011 నుంచి 2018 సంవత్సరాల మధ్య భూ వాతావరణంలో ఉష్ణోగ్రత 0.65 శాతం డిగ్రీలు పెరిగింది. చల్లటి గాలిలోకన్నా వేడి గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. వేడిగాలి తేమ వల్ల వాతావరణంలో అల్పపీడన ద్రోణి ఏర్పడి వర్షాలు కురుస్తాయి. తేలిగ్గా ఉండే వేడిగాలి పైకి దూసుకుపోవడం వల్ల పై వాతావరణంలో ఒత్తిడి పెరగడమే కాకుండా వేడిగాలి చోట శూన్యం ఏర్పడి, ఆ శూన్యంలోని పరిసర ప్రాంతాల తేమతో కూడిన గాలులు దూసుక రావడం వల్ల అల్పపీడనం ఏర్పడి వర్షాలు కురుస్తాయి. ఈ అల్పపీడనం ‘సైక్లోన్‌ సర్కులేషన్‌’గా మారితే భారీ వర్షాలు కురుస్తాయి. భూమి తిరుగుతున్న వైపే తుపాన్‌ ప్రయాణించడాన్ని సైక్లోన్‌ సర్కులేషన్‌గా వ్యవహరిస్తారు. మొత్తంగా భూ వాతావరణం వేడిక్కడం వల్ల ఈ సారి వర్షాలు ఎక్కువగా కురిశాయని, భూతాపోన్నతి వల్ల కొన్ని సార్లు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top