ఏపీ, తెలంగాణలకు పన్ను ప్రోత్సాహకాలు ఇస్తుండడంపై కాంగ్రెస్ నేత వీరప్పమొయిలీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏపీ, తెలంగాణలపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన హరిబాబు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణలకు పన్ను ప్రోత్సాహకాలు ఇస్తుండడంపై కాంగ్రెస్ నేత వీరప్పమొయిలీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌పై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీ, తెలంగాణలకు అదనపు పెట్టుబడి అలవెన్స్, డిప్రిసియేషన్ అలవెన్స్‌లను ప్రకటించడం స్వాగతించదగిన పరిణామమే. దీని పర్యవసనాలేంటో ప్రభుత్వానికి తెలుసా? ఈ కారణంగా కేరళ, కర్ణాటక, బీహార్ వంటి రాష్ట్రాలకు దక్కాల్సిన పెట్టుబడులన్నీ ఆ రెండు రాష్ట్రాలకే వెళ్తాయి. ఒక పద్ధతి ఉండాలి. ఇతర రాష్ట్రాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి’ అని పేర్కొన్నారు.
వ్యతిరేకించడం తగదు: బీజేపీ ఎంపీ హరిబాబు
ఏపీకి కేంద్రం పారిశ్రామిక రాయితీలు ఇవ్వడాన్ని కాంగ్రెస్ ఎంపీ వీరప్పమొయిలీ వ్యతిరేకించడం తగదని, ఈ చర్యలు కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. సోమవారం పార్లమెంటు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి కేంద్రం ఏమీ చేయడం లేదని ఓవైపు కోటి సంతకాల కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టగా, మరోవైపు మొయిలీ ఇలా వ్యాఖ్యానించడం సరికాదని విమర్శించారు.