
ప్రతీకాత్మక చిత్రం
ముజఫర్‌నగర్, ఉత్తరప్రదేశ్ : ప్రేమ వల్లే తాను పరీక్ష సరిగా రాయలేకపోతున్నానంటూ ఓ విద్యార్థి జవాబు పత్రంలో రాసుకొచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్షల్లో చోటు చేసుకుంది. రసాయన శాస్త్ర పరీక్షకు తాను సరిగా చదవలేదని, అందుకు తన ప్రేమే కారణమని చెప్పుకొచ్చాడు సదరు విద్యార్థి. ‘పూజను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ మనిషి ఒక్కచోట కుదురుకోనివ్వదు. కూర్చొనివ్వదు. నిల్చొనివ్వదు. అందుకే పరీక్షకు సరిగా చదవలేకపోయాను.’ అంటూ విద్యార్థి జవాబు పత్రంలో రాశాడు.
జవాబు పత్రంలో మిగతా పేజీలన్నింటిలో హార్ట్ సింబల్‌ను అందంగా గీశాడు. దీనిపై మాట్లాడిన ముజఫర్‌నగర్ స్కూల్ ఇన్‌స్పెక్టర్ మునేష్ కుమార్.. జవాబు పత్రాల్లో చాలామంది విద్యార్థులు తమ బాధలను రాశారని చెప్పారు. కొందరైతే పాస్ చేయాలంటూ డబ్బును పిన్ చేసి పంపారని తెలిపారు. ఒక విద్యార్థి అయితే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలని కూడా చూశాడని చెప్పారు.
తనకు తల్లి లేదని, ఫెయిల్ అయితే తండ్రి చంపేస్తాడని ఆ విద్యార్థి జవాబు పత్రంలో రాశాడని వివరించారు. మరొక విద్యార్థి తనను పాస్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రాశాడని తెలిపారు.