
భార్య వసంతతో ప్రొఫెసర్ సాయిబాబా(ఫైల్)
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కారణంగా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాతో సహా పాత్రికేయుడు ప్రశాంత్ రాహి, జేఎన్‌యూ పరిశోధక విద్యార్థి హేమ్ మిశ్రా, పాండు నరోత్, మహేశ్ టిర్కిలకు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనీ, రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫోరం సభ్యులంటూ రాజద్రోహ నేరం మోపి, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ప్రొఫెసర్ సాయిబాబాను నాగ్‌పూర్ సెంట్రల్ జైలులోని అండాసెల్‌లో ఉంచారు. ఆయన 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్నారు.
అంతకుముందు హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో ఆయన కొంత కాలం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో కనీసం అత్యవసర మందులు సైతం అందించకపోవడంతో సాయిబాబా ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడిందని సాయిబాబా సహచరి వసంత ‘సాక్షి’కి తెలిపారు. ఆయనకు శిక్ష విధించే కొద్దిరోజుల ముందు పిత్తాశయం, క్లోమగ్రంధికి సంబంధించిన ఆపరేషన్‌ని మూడునెలలలోగా చేయాలని డాక్టర్లు సిఫారసు చేసినప్పటికీ జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు వసంత తెలిపారు. ఇటీవల మందులు సైతం ఇవ్వకపోవడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని ఛాతీనొప్పి తీవ్రమైందని ఆమె ‘సాక్షి’కి ఫోన్‌లో వివరించారు. గత జూన్ 1వ తేదీన సాయిబాబా అనారోగ్యాన్ని పరిగణనలోనికి తీసుకొని సాయిబాబాకు అత్యవసరంగా వైద్య సాయం అందించాలని జాతీయ మానవహక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.
నేలమీద పాకుతూ ఓ జంతువులా బతుకుతున్నా...
తాజాగా తన ప్రాణాలు అత్యంత ప్రమాదంలో ఉన్నాయని, తనను గురించి పట్టించుకోవాలని, అండాసెల్‌లో ఈ చలిని తట్టుకొని బతకడం అసాధ్యమని తన సహచరి వసంతకు సాయిబాబా రాసిన లేఖ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 90 శాతం వైకల్యంతో ఎవరి సాయం లేకుండా అంగుళం కూడా కదల్లేని పరిస్థితుల్లో నేలమీద పాకుతూ ఓ జంతువులా తాను బతుకుతున్నానని, తనకు స్వెట్టర్ కానీ, కనీసం కప్పుకునేందుకు దుప్పటికానీ ఇవ్వలేదని, నవంబర్‌లో గడ్డకట్టుకుపోయే చలిని తట్టుకొని తాను బతకడం అసాధ్యమైన విషయమని, తాను ఉన్న అత్యంత దయనీయమైన పరిస్థితుల గురించి వసంతకు రాసిన లేఖలో దుఃఖభరితంగా వివరించారు. నేలమీద పాకుతూ 90 శాతం అంగవైకల్యంతో ఉన్న మనిషి జైల్లో ఉన్నాడన్న విషయం ఎవరికీ పట్టకపోవడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ త్వరితగతిన సీనియర్ లాయర్‌తో మాట్లాడి తన ప్రాణాలను కాపాడాలని ఆయన లేఖలో కోరారు. తానొక భిక్షగాడిలా తన గురించి పట్టించుకోవాలంటూ పదే పదే ప్రాధేయపడాల్సి రావడం కుంగదీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ మొదటి వారంలో బెయిలు పిటిషన్ దాఖలు చేయాలని లేఖలో కోరారు. అలా జరగకపోతే తన పరిస్థితి చేయిదాటిపోతుందని పేర్కొన్నారు. ఇదే చివరి ఉత్తరం అని, ఇక మీదట తానీ విషయాన్ని రాయబోనని కూడా లేఖలో తేల్చిచెప్పారు. తనను పట్టించుకోకపోవడాన్ని నేరపూరిత నిర్లక్ష్యంగా సాయిబాబా వ్యాఖ్యానించారు.
ప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే హైదరాబాద్‌కి తరలించాలి...
విరసం నేత వరవరరావు మాట్లాడుతూ ఆయన బెయిలుకోసం ప్రయత్నాలు జరుగు తున్నాయని, ప్రభుత్వం సాయిబాబా పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం మాను కోవాలని, తక్షణమే ఆయనకు అత్యవసర మందులు అందించాలని, తన కనీస అవసరాలు తీర్చాలని కోరారు, సాయిబాబా అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తనను హైదరాబాద్ జైలుకు తక్షణమే తరలించి సరైన వైద్య సదుపాయం అందించాలని వరవరరావు డిమాండ్ చేశారు. తన గురించి పట్టించుకోని ప్రభుత్వం, పాల కులు, సమాజం బాధ్యతను లేఖ గుర్తు చేస్తోం దని పౌర హక్కుల సంఘం నాయకులు నారా యణరావు, ప్రొ.లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.
–వరవరరావు, నారాయణరావు, ప్రొఫెసర్ లక్ష్మణ్