
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు తెలంగాణ శకటం ఎంపికైంది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ శకటంపై గురువారం ఇక్కడ రక్షణ శాఖ నిర్వహించిన తుది ఎంపిక సమావేశంలో అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ సమావేశంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, సమాచార శాఖ అధికారులు, ఆర్టిస్టులు పాల్గొన్నారు. అయితే ఎంపికపై రక్షణ శాఖ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే బతుకమ్మ పండుగ, మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర, వేయి స్తంభాల గుడి థీమ్‌తో ఈ శకటం ఆకట్టుకుంటోంది.