
సాక్షి, చెన్నై: తమిళనాడు, కేరళల్లో ఓక్కి ప్రళయంతో సముద్రంలో గల్లంతైన జాలర్లలో 2,124 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. తీవ్ర వరదకు గురైన కన్యాకుమారి ప్రజల్ని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పరామర్శించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, మంత్రులు తంగమణి, జయకుమార్, ఉదయకుమార్ అక్కడే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కూడా కన్యాకుమారి వెళ్లి బాధితులను ఓదార్చారు.
గల్లంతైన పడవలు, అందులోని జాలర్ల జాడను పసిగట్టేందుకు అదనంగా హెలికాప్టర్లు, విమానాలు, నౌకలను రంగంలోకి దింపారు. కులచల్‌కు చెందిన 34 మందిని కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు. 129 పడవలు, 1,247 మంది జాలర్లు లక్షదీవులు, మినికో, కర్ణాటక, ముంబై సముద్రతీరాల్లో సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు. కన్యాకుమారిలో ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలు బయటపడ్డాయని, 73 మందిని రక్షించినట్టు జిల్లా కలెక్టర్ సజన్ సింగ్ ఆర్ చౌహాన్ తెలిపారు. అధికారులు తమవారి సమా చారం ఇవ్వట్లేదని కన్యాకుమారిలో జాలర్ల కుటుంబాలు ఆందోళనలకు దిగాయి.