ఎందరినో రక్షించి.. బలయ్యాడు

Tahsildar Deceased With Coronavirus in Tamil nadu - Sakshi

తహసీల్దార్‌ను కబళించిన కరోనా

సాక్షి,చెన్నై: కోయంబేడు మార్కెట్‌ నుంచి గ్రామాల్లోకి వచ్చిన కూలీలను గుర్తించి, ఎందరినో క్వారైంటన్లకు, కరోనా వార్డులకు తరలించిన  విరుదాచలం తహసీల్దార్‌ వైరస్‌కు బలికావడం చిదంబరంలో విషాదాన్ని నింపింది. చెన్నై కోయంబేడు రూపంలో విల్లుపురం, తిరువణ్ణామలై, కడలూరు, కళ్లకురిచ్చి జిల్లాల్లో అమాంతంగా కరోనా కేసులు పెరిగిన విషయం తెలిసిందే. ఇందుకు కారణం ఈ జిల్లాల్లో ఉన్న కూలీలు అత్యధికంగా కోయంబేడు మార్కెట్‌లో పనిచేస్తుండడమే. చడీచప్పుడు కాకుండా స్వగ్రామాలకు చేరిన కూలీలను గుర్తించేందుకు విరుదాచలం తహసీల్దార్‌  కవియరసు(48) నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఈ బృందం రెండు నెలలుగా ఎందరినో గుర్తించింది. గ్రామాలతో నిండిన కడలూరు జిల్లా పరిధిలో విస్తృతంగానే తిరిగింది.

కూలి కార్మికుల రూపంలో గ్రామాల్లో వైరస్‌ బారిన పడ్డ వారిని పసిగట్టి క్వారంటైన్లు, కరోనా వార్డులకు తరలించింది. నిరంతర సేవలో ముందుకు సాగుతూ వచ్చిన కవియరసును ఈ నెల పదో తేదిన వైరస్‌ తాకింది. దీంతో ఆయన బృందంలో ఉన్న వారందరినీ స్వీయ నిర్భంధంలో ఉంచారు. ఎనిమిది  రోజులుగా చిదంబరం  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన కవియరసు పరిస్థితి విషమించింది. ఆదివారం ఆయన తుది శ్వాస విడిచారు. కరోనా వైరస్‌ బారిన పడి రెవెన్యూ అధికారి మరణించడంతో కడలూరు జిల్లా యంత్రాంగాన్ని కలవరంలో పడేసింది. ఎందరినో రక్షించి, చివరకు వైరస్‌ బారిన పడి కవియరసు మృత్యువాత పడడాన్ని రెవెన్యూ వర్గాలు జీర్ణించుకోలేకున్నాయి. విధి నిర్వహణలో సేవాతత్వంతో ముందుకు సాగే కవియరసు సేవలు అజరామరం అని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top