రాష్ర్టప్రతి పాలన నిర్ణయం దరిమిలా తీవ్ర నైరాశ్యంలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పీసీసీ పీఠం కోసం ఆరాటపడుతున్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ర్టప్రతి పాలన నిర్ణయం దరిమిలా తీవ్ర నైరాశ్యంలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పీసీసీ పీఠం కోసం ఆరాటపడుతున్నారు. తెలంగాణ, సీమాంధ్రలకు వేర్వేరు పీసీసీలను రెండు మూడు రోజుల్లో ప్రకటించేందుకు అధిష్టానం కసరత్తులు జరుపుతున్న నేపథ్యంలో ఆశావహులంతా ఆ దిశగా ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. సీమాంధ్రలో కాపు లేదా దళిత సామాజిక వర్గానికి, తెలంగాణలో బీసీ లేదా రెడ్డి సామాజిక వర్గానికి పీసీసీ పీఠం దక్కవచ్చని తెలుస్తోంది. కేంద్ర మంత్రి చిరంజీవికి సీమాంధ్రలో ఎన్నికల ప్రచార బాధ్యతలు కట్టబెట్టాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని సమాచారం. తెలంగాణ నుంచి సీఎం పదవికి పోటీ పడ్డ మంత్రి జానారెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర్‌కు పీసీసీ పదవి కూడా దక్కే సూచనలు కనిపించడం లేదు.
బీసీ నేతకే అవకాశమివ్వాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. రెడ్డి నేతకు ఇవ్వాలనుకుంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి దక్కే సూచనలున్నాయి. జానా, దామోదర మాత్రం ఢిల్లీలో ఉండి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఉత్తమ్ తరఫున కూడా ఢిల్లీలో లాబీయింగ్ సాగుతున్నట్టు చెబుతున్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యేలు ఆర్.దామోదర్‌రెడ్డి, భిక్షమయ్య గౌడ్ ఢిల్లీ పెద్దలను కలిసి ఉత్తమ్‌కు పగ్గాలివ్వాలని కోరుతున్నట్టు తెలిసింది. జానా మాత్రం కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఆశీస్సులతో ప్రయత్నిస్తున్నారంటున్నారు. జైపాల్‌తో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు.