పిక్నిక్‌ స్పాట్‌ అనుకుంటున్నారా?

Supreme Court slams Income Tax department - Sakshi

ఐటీ శాఖ అలసత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

రూ.10 లక్షల జరిమానా

న్యూఢిల్లీ: ఓ కేసు విషయంలో అలసత్వం వహించిన ఆదాయపు పన్ను(ఐటీ) శాఖపై సుప్రీంకోర్టు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టానుసారం రావడానికి కోర్టు పిక్నిక్‌ స్థలం కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. న్యాయస్థానానికి తప్పుడు సమాచారం సమర్పించడంపై తీవ్రంగా స్పందించిన జస్టిస్‌ మదన్‌.బి.లోకూర్, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ల ధర్మాసనం ఐటీ శాఖకు రూ.10 లక్షల జరిమానా విధించింది. సరైన కారణం చెప్పకుండా 596 రోజుల తర్వాత తీరిగ్గా స్పందించడంపై మండిపడింది.

ఉత్తరప్రదేశ్‌లోని హపుల్‌–పిల్ఖువా అభివృద్ధి మండలి(హెచ్‌పీడీఏ) యూపీ పట్టణ ప్రణాళికాభివృద్ధి చట్టం–1973 కింద ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో ఐటీ చట్టం–1961 కింద రిజిస్ట్రేషన్‌ కోసం ఘజియాబాద్‌ ఐటీ కమిషనర్‌కు హెచ్‌పీడీఏ దరఖాస్తు చేసుకుంది. అయితే హెచ్‌పీడీఏ సేవా కార్యక్రమాల కోసం పనిచేయడం లేదన్న కమిషనర్‌ 2006, జూన్‌లో ఈ దరఖాస్తును తిరస్కరించారు. దీంతో హెచ్‌పీడీఏ ఆదాయపు పన్ను అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌(ఐటీటీఏ)ను ఆశ్రయించడంతో.. కమిషనర్‌ ఆదేశాలను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఐటీటీఏ ఉత్తర్వులను సవాలుచేస్తూ ఆదాయపు పన్ను శాఖ అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా చుక్కెదురైంది. దీంతో 2016, ఆగస్ట్‌ 29న ఐటీ శాఖ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేసింది.

తాజాగా ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఇదే తరహా పిటిషన్‌ ఒకటి సుప్రీంకోర్టులో 2012 నుంచి పెండింగ్‌లో ఉందని ఘజియాబాద్‌ ఐటీ శాఖ కమిషనర్‌ కోర్టుకు తెలిపారు. అయితే 2012లో కేసుపై అప్పుడే తీర్పు ఇచ్చామన్న అత్యున్నత న్యాయస్థానం, కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడంపై తీవ్ర విస్మయం వ్యక్తంచేసింది. పిటిషన్‌ దాఖలు చేసిన 596 రోజుల తర్వాత కోర్టుకు హాజరుకావడం, ఈ ఆలస్యానికి సరైన కారణం చెప్పకపోవడంపై ఆగ్రహించిన ధర్మాసనం.. ఐటీశాఖకు రూ.10 లక్షల జరి మానా విధించింది. ఈ మొత్తాన్ని సుప్రీంకోర్టు న్యాయసేవల కమిటీ వద్ద 4 వారాల్లోగా డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని బాల నేరస్తులకు సంబంధించి అంశాల్లో వినియోగించాలని ధర్మాసనం తెలిపింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top