
సాక్షి, శ్రీనగర్ : ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి ముందు ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు భద్రతా దళాలు అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖల వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. అమర్‌నాథ్ యాత్ర కోసం బల్టాల్, పహల్గాం రూట్లలో పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించామని, శాంతిభద్రతల పర్యవేక్షణ, కౌంటర్ ఇంటెలిజెన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని జమ్ము కశ్మీర్ జోన్ సీఆర్‌పీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ వీఎస్‌కే కౌముది తెలిపారు.
కాగా, జమ్ము కశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించిన మరుసటి రోజు భద్రతా దళాలు ఈ చర్యను చేపట్టాయి. మరోవైపు గవర్నర్ వోహ్రా ఉగ్ర కార్యకలాపాలను దీటుగా ఎదర్కోవడంలో పేరొందిన మాజీ పోలీస్ బాస్ విజయ్ కుమార్‌ను తన సలహాదారుగా ఎంపిక చేసుకోవడం గమనార్హం.
కశ్మీర్‌లో పాలక బీజేపీ-పీడీపీ సర్కార్ కుప్పకూలిన కొద్ది గంటల్లోనే రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. రంజాన్ సందర్భంగా నిలిపివేసిన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను గత వారం పునరుద్ధరించారు.