‘హైదరాబాద్‌ బదులు పాక్‌కు కశ్మీర్‌’

Saifuddin Soz Says Sardar Patel Offered Kashmir To Pakistan Exchange Of Hyderabad - Sakshi

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సైఫుద్దీన్‌ సోజ్‌ కశ్మీర్‌ అంశంపై మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కశ్మీర్‌ స్వాతం‍త్ర్యంపై పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ వైఖరిని సోజ్‌ సమర్ధించిన సంగతి తెలిసిందే. సోజ్‌ రచించిన ‘గ్లిమ్‌ప్సెస్‌ ఆఫ్‌ హిస్టరీ అండ్‌ స్టోరీ ఆఫ్‌ స్ట్రగుల్‌’ పుస్తకావిష్కరణ సభ సోమవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతం‍త్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కశ్మీర్‌ను పాక్‌కు ఇచ్చేందుకు సిద్దమయ్యారని సంచలన కామెంట్‌ చేశారు.

‘హైదరాబాద్‌కు బదులు పాక్‌కు కశ్మీర్‌ను ఇచ్చేలా పటేల్‌ ప్రతిపాదించారు. అప్పటి పాక్‌ ప్రధాని లిఖ్వాత్‌ అలీఖాన్‌తో చర్చలు జరిపేటప్పుడు పటేల్‌ హైదరాబాద్‌ ప్రస్తావన తీసుకురావద్దని కోరారు. హైదరాబాద్‌ బదులు కశ్మీర్‌ను పాక్‌ తీసుకోవచ్చన్నారు. ఖాన్‌ యుద్ద సన్నాహాలు ప్రారంభించినప్పటికీ.. పటేల్‌ మాత్రం ఆ దిశలో చర్యలు చేపట్టలేద’ని సోజ్‌ చెప్పుకొచ్చారు. ఇప్పటికే ముషార్రఫ్‌ను సమర్ధిస్తూ సోజ్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ కూడా సోజ్‌ వ్యాఖ్యలపై స్పందించడానికి వెనుకాడుతోంది. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా మాత్రం జమ్మూ కశ్మీర్‌ కాంగ్రెస్‌ కమిటీ సోజ్‌పై తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ నుంచి జైరామ్‌ రమేశ్‌ హాజరయ్యారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top