
ఆ జాబితాపై భయాందోళనలు వద్దన్న రాజ్‌నాథ్ సింగ్
సాక్షి,న్యూఢిల్లీ : అసోం నూతన పౌరసత్వ జాబితా (ఎన్‌ఆర్‌సీ)లో 40 లక్షల మంది లేకపోవడంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఇది కేవలం ముసాయిదా జాబితా మాత్రమేనని, ఏ ఒక్క పౌరుడి పట్ల వివక్ష చూపే ప్రసక్తే లేదని, అనవసర వేధింపులు ఉండవని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జాతీయ పౌరసత్వ జాబితా నిజాయితీ, పారదర్శకతతో కూడిన ప్రక్రియ అన్నారు. సుప్రీం కోర్టు రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే తాము చర్యలు చేపడుతున్నామని మంత్రి శుక్రవారం రాజ్యసభలో చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఏ ఒక్క భారతీయుడని తాము విస్మరించమని తాను హామీ ఇస్తున్నానని, ఈ జాబితాపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేశారు. అసోంలో జాతీయ పౌరసత్వ జాబితాలో చోటు దక్కని వారిపై ఎలాంటి తీవ్ర చర్యలు ఉండవని తేల్చిచెప్పారు. ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో పేరు లేని వారు విదేశీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు.
కొందరు ఉద్దేశపూర్వకంగా భయాందోళనలు రేకేత్తించి, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్‌ఆర్‌సీ జాబితాపై తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్ధాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో 40 లక్షల మంది పేర్లు లేకపోవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.