
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలకు హాజరైన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌కు ఆరో వరసలో సీటును కేటాయించారు. దీంతో రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఆజాద్‌తో కలసి ఆయన తనకు కేటాయించిన సీటులోనే కూర్చున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీపై విరుచుకుపడింది. సంప్రదాయాలను విస్మరించి ప్రవర్తిస్తున్న బీజేపీ నాయకుల దురహంకారానికి ఈ ఘటన ఓ నిదర్శనమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా దుయ్యబట్టారు.
ఇటీవలే పార్టీ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకున్న సోనియా సహా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులందరూ గణతంత్ర వేడుకల్లో ముందు వరసలోనే కూర్చొనేవారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ‘ సంప్రదాయాన్ని విస్మరించి ఉద్దేశపూర్వకంగానే, రాహుల్‌ను అవమానించాలని కాంగ్రెస్ అధ్యక్షుడికి ఆరో వరసలో సీటును కేటాయించారు. అయినా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడమే మాకు అన్నింటికన్నా ముఖ్యం’ అని రణ్‌దీప్ ట్వీట్ చేశారు. కాగా, మాజీ ప్రధానులు దేవెగౌడ, మన్మోహన్ సింగ్, ప్రస్తుత మంత్రులు స్మృతీ ఇరానీ, థావర్ చంద్ గెహ్లాట్æ తదితరులు తొలివరసలో కూర్చున్నారు.