పోస్ట్‌కార్డ్ను బతికిస్తున్నాడు.. | pradeep lokhande.. post card man of india | Sakshi
Sakshi News home page

పోస్ట్‌కార్డ్ను బతికిస్తున్నాడు..

Nov 23 2015 4:25 PM | Updated on Sep 3 2017 12:54 PM

పోస్ట్‌కార్డ్ను బతికిస్తున్నాడు..

పోస్ట్‌కార్డ్ను బతికిస్తున్నాడు..

మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి.. అన్నట్టుగా, మనిషన్నాక జీవితానికి ఓ లక్ష్యం అంటూ ఉండాలని తలంచిన స్థానిక సోషల్ ఇంటర్‌ప్రీనర్ ప్రదీప్ లోఖాండే గ్రామీణాభివృద్ధి కోసం పలు సామాజిక పథకాలు చేపట్టారు.

పుణె: మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి.. అన్నట్టుగా, మనిషన్నాక జీవితానికి  ఓ లక్ష్యం అంటూ ఉండాలని తలంచిన స్థానిక సోషల్ ఇంటర్‌ప్రీనర్ ప్రదీప్ లోఖాండే గ్రామీణాభివృద్ధి కోసం పలు సామాజిక పథకాలు చేపట్టారు. అందుకోసం గ్రామీణ సంబంధాల సంస్థను ఏర్పాటు చేశారు. ఈ మెయిల్, ఎస్సెమ్మెస్‌లు రాజ్యమేలుతున్న నేటి యాంత్రిక యుగంలో పోస్ట్‌కార్డ్‌ను పరిరక్షించడం కోసం ఓ ఉద్యమాన్నే చేపట్టారు.

ప్రదీప్ పోస్ట్ కార్డు ద్వారానే గ్రామీణ భారత్‌లోని దాదాపు 58 లక్షల మంది ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లోని 49 వేల గ్రామాల డేటాబేస్‌ను ప్రస్తుతం కలిగి ఉన్నారు. ప్రతి రోజు ఆయనకు వివిధ గ్రామాల నుంచి కనీసం 150 పోస్ట్ కార్డులు వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉపాధి అవకాశాలు మెరగుపర్చుకోవాలో, ఎలాంటి ఉద్యోగాలు, ఎలా చేయాలో పోస్ట్ కార్డు ద్వారానే సలహాలిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ల విస్తరణకు, ఉపాధి అవకాశాలకు కన్సల్టెంట్‌గా మారిపోయారు. పోస్ట్‌కార్డ్ మేన్ ఆఫ్ ఇండియాగా ముద్రపడిన ప్రదీప్ చిరునామా కూడా ఏక వాక్యంలో 'ప్రదీప్ లోఖాండే, పునె, 411ఏ13' అని ఉంటుంది. చిరునామాలో ఇది రాస్తే చాలు. నేరుగా పోస్ట్‌కార్డ్ ప్రదీప్‌కు చేరుతుంది.

'గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల్లో  3,055 గ్రంధాలయాల ఏర్పాటుకు నేను కృషి చేశాను. ఆ గ్రామాల పిల్లల నుంచి ఇప్పటి వరకు నాకు 94 వేల పోస్ట్‌కార్డులు వచ్చాయి. పోస్ట్‌కార్డులను బతికించడం కోసమే కాకుండా పిల్లల్లో పుస్తకాల పఠనాశక్తిని పెంపొందించేందుకు నేను ఇదంతా చేస్తున్నాను. టెల్కో, పీఆండ్‌జీ, టాటా టీ లాంటి కార్పొరేట్ సంస్థలకు రూరల్ రిసోర్స్ పార్టనర్‌గా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో గ్రామీణాభివృద్ధి పథకాల అమలుకు కృషి చేశాను' అని ప్రదీప్ మీడియాకు వివరించారు. 
ఈ పది రాష్ట్రాల్లోని 4,700 గ్రామాలకు తన భార్య, తండ్రి సహాకారంతో 20 వేల పోస్ట్‌కార్డులు రాయడంతో దశాబ్దం క్రితం తన ఉద్యమం ప్రారంభమైందని, టీచర్లకు, గ్రామ సర్పంచ్‌లకు లేఖలు రాశామని,  తొలుత ప్రజల నుంచి స్పందన పెద్దగా రాలేదని, ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు 5,800 గ్రామాలను స్వయంగా సందర్శించానని చెప్పారు. ప్రతి గ్రామంలోని వనరులు ఏమిటో, అక్కడ కొత్త మార్కెట్లు ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఎలా ఉన్నాయో, ఉపాధి అవకాశాలు ఎలా మెరగుపరచవచ్చో క్షుణ్నంగా అధ్యయనం చేశానని, ఆ తర్వాత వాటిని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రజలతో తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నానని వివరించారు. తద్వారా రూరల్ మార్కెటింగ్ వ్యవస్థ ఎంతో మెరుగుపడిందని అన్నారు.

 ఇదే క్రమంలో 'జ్ఞాన్ కీ లైబ్రరీస్' అనే ఉద్యమాన్ని చేపట్టానని, 'నాన్ రెసిడెంట్ విలేజర్' పేరిట పల్లెలు వదిలి పట్టణాల్లో నివసిస్తున్న వారి సహకారం తీసుకున్నానని, తద్వారా వివిధ రాష్ట్రాల్లోని వివిధ గ్రామాల్లోని 3,055 సెకండరీ పాఠశాలల్లో గ్రంధాలయాలను ఏర్పాటు చేశానని ప్రదీప్ తెలిపారు. ఈ గ్రంధాలయాల వల్ల దాదాపు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఇటీవల తన కూతురు పెళ్లికి పోస్ట్‌కార్డుమీదనే పెళ్లి ఇన్విటేషన్ కొట్టించి వాటిని బంధు, మిత్రులకు పోస్ట్ చేశామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement