మాట వినని అధికారులపై ‘ధిక్కారం’ | posting of officers continues in Delhi government after SC verdict | Sakshi
Sakshi News home page

మాట వినని అధికారులపై ‘ధిక్కారం’

Jul 6 2018 3:30 AM | Updated on Sep 2 2018 5:20 PM

posting of officers continues in Delhi government after SC verdict - Sakshi

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియా

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని అధికారులపై కోర్టు ధిక్కార పిటిషన్‌ వేసే యోచనలో ఆప్‌ నాయకత్వం ఉంది. ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) అధికారాల పరిధిని పేర్కొంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం.. అధికారుల నియామకాలు, బదిలీలు చేసే అధికారాన్ని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు అప్పగించింది. అయితే సేవల విభాగం (సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌) దీన్ని వ్యతిరేకిస్తోంది. ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలు చేసే అధికారం కేంద్ర హోం శాఖకు అప్పగిస్తూ 2016లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీం కోర్టు రద్దు చేయలేదని చెబుతోంది. దీనిపై ఆప్‌ ప్రభుత్వం న్యాయ పోరాటం చేయాలని యోచి స్తోంది. దీనిలో భాగంగా కోర్టు ధిక్కార పిటిషన్‌ వేయనున్నట్టు ఆప్‌ అధికార ప్రతినిధి చెప్పారు.

అధికారులు సహకరించాలి: కేజ్రీవాల్‌
న్యాయస్థానం తీర్పును గౌరవించి, ఢిల్లీ అభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా విజ్ఞప్తి చేశారు. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం సలహాలు, సూచనల ఆధారంగా ఎల్జీ నడుచు కోవాలని, శాంతిభద్రతలు, పోలీస్, భూవ్యవ హారాలు తప్ప మిగిలిన అన్ని విషయాల్లో ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొందని.. దీన్ని పరిగణనలోకి తీసుకుని అధికారులు తమకు సహకరించాలని కేజ్రీవాల్‌ కోరారు.

ఢిల్లీ అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేద్దామని అధికారులకు ఆయన ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశారు. ‘ఢిల్లీ అభివృద్ధి కోసం అధికారులు, నాయకులు.. అందరూ కలసి కట్టుగా కృషి చేద్దామని కోరుతున్నాను. ఎల్జీని కూడా కలిసేందుకు సమయం తీసుకోనున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు డిప్యూటీ సీఎం సిసోడియా మీడియాతో మాట్లాడుతూ సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రభుత్వ ఆదేశాలు పాటించదని చీఫ్‌ సెక్రటరీ లిఖితపూ ర్వకంగా తెలిపారన్నారు. వారు తమ ఆదేశాలు పాటించ కున్నా, బదిలీ ఫైళ్లు ఇప్పటికీ ఎల్జీకే పంపినా అది కోర్టు ధిక్కారం కిందకి వస్తుంద న్నారు. ఏం చేయాలనే విషయమై న్యాయనిపుణులను సంప్రదిస్తున్నామన్నారు.

ఆప్‌ వాదన తప్పు: జైట్లీ
కేంద్రపాలిత ప్రాంత అధికారులపై పాలనాధికారాలు సుప్రీంకోర్టు తమకే ఇచ్చిందని ఆప్‌ ప్రభుత్వం వాదించడం పూర్తిగా తప్పని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. ఐఏఎస్‌ అధికారులు, దర్యాప్తు బృందాల నియామకం వంటి అంశాల్లో ఢిల్లీ సర్కార్‌కు అధికారాలు లేవని జైట్లీ ఫేస్‌బుక్‌ బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమని, పోలీస్, శాంతిభద్రతలు, భూవ్యవహారాలు వంటి అంశాలపై కేంద్రానికే అజమాయిషీ ఉంటుందని, అధికారుల నియామకం, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం లేదన్నారు. ఢిల్లీ రాష్ట్రం కానందున, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే అధికారాలన్నీ ఎన్నికైన కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వానికి ఉంటాయనే వాదన అర్థరహితమని జైట్లీ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రభుత్వానికి పోలీస్‌ అధికారాలు లేనందున రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను విచారణ నిమిత్తం నియమించలేదని జైట్లీ వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement