
ఆర్బీఐ చర్యలను సమర్ధించిన ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు ఆర్‌బీఐ ప్రకటించిన చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ సమర్ధించారు. కేంద్ర బ్యాంక్ చర్యలతో వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెరగడంతో పాటు రుణాల జారీ మెరుగుపడుతుందని వ్యాఖ్యానించారు. ఆర్‌బీఐ ప్రకటించిన చర్యలతో చిన్న వ్యాపారాలు, మధ్యతరహా పరిశ్రమలు, రైతులు, పేదలకు ఊరట లభిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వాలకూ అత్యవసర నిధుల కింద సమకూరే నిధుల లభ్యత పెరుగుతుందని ప్రధాని శుక్రవారం ట్వీట్ చేశారు.
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియా సమావేశం అనంతరం ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా పలు చర్యలు చేపడుతున్నామని అంతకుముందు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. వ్యవస్ధలో ద్రవ్య లభ్యత పెంచడం, రుణ పరపతి మెరుగుదల సహా పలు చర్యలను ఆయన ప్రకటించారు. కరోనా వైరస్ ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.