మన సరిహద్దు క్షేమం

PM Narendra All Party Meet on India-China Border Issue - Sakshi

భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదు

మన పోస్ట్‌లను ఎవరూ స్వాధీనం చేసుకోలేదు

మన వైపు చూసిన వారికి జవాన్లు గుణపాఠం చెప్పారు

ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం

చైనాతో ఉద్రిక్తతలపై అఖిల పక్షానికి ప్రధాని వివరణ

బాసటగా నిలిచిన పార్టీలు

న్యూఢిల్లీ: మన భూభాగంలోకి ఎవరూ రాలేదని, సరిహద్దు క్షేమమని, మన ఆర్మీ పోస్ట్‌లను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చైనా సాగించిన దురాగతానికి యావద్దేశం గాయపడిందని, ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. భారత్‌ శాంతిని, స్నేహ సంబంధాలనే కోరుకుంటుందని, అదే సమయంలో, దేశ సార్వభౌమత్వం విషయంలో రాజీ లేదని, అదే మనకు సర్వోన్నతమని స్పష్టం చేశారు. సరిహద్దులను కాపాడే విషయంలో సైన్యం సమర్ధంగా వ్యవహరిస్తోందన్నారు.

అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు. వాస్తవాధీన రేఖకు సంబంధించి భారత్‌ విధానాన్ని దౌత్య మార్గాల ద్వారా చైనాకు స్పష్టం చేశామని ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలతో పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారతీయ జవాన్లు అమరులై, చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని∙మోదీ శుక్రవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ప్రభుత్వానికి అండగా ఉంటామని భేటీలో పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించాయి.

రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర ప్రధాన పార్టీల అగ్రనేతలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాల్వన్‌ లోయలో జూన్‌ 15 రాత్రి చైనా సైనికులతో చోటు చేసుకున్న ఘర్షణ తదనంతర పరిణామాలను, ప్రస్తుత పరిస్థితిని మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, జై శంకర్‌ పార్టీల నేతలకు వివరించారు. చైనాతో వ్యవహరించాల్సిన తీరుపై దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ భేటీలో వివిధ పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

మొదట, చైనాతో సరిహద్దు ఘర్షణల్లో అమరులైన 20 మంది వీర జవాన్లకు ప్రధాని, మంత్రులు, పార్టీల నేతలు 2 నిమిషాల పాటు మౌనం పాటించి, నివాళులర్పించారు. జవాన్ల త్యాగం వృధా కాబోదని ప్రధాని పునరుద్ఘాటించారు. భారత్‌ వైపు చూసే ధైర్యం చేసినవారికి మన వీర  జవాన్లు తగిన గుణపాఠం చెప్పారని ప్రధాని వ్యాఖ్యానించారు. గాల్వన్‌ లోయ, ప్యాంగ్యాంగ్‌ సరస్సు ప్రాంతాల్లోని భారత భూభాగాల్లోకి చైనా సైనికులు చొచ్చుకువచ్చారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని వివరణ ఇచ్చారు.

మన భూభాగంలో ఒక అంగుళాన్నైనా ఎవరూ ఆక్రమించుకునే ధైర్యం చేయలేనంత స్థాయిలో సామర్థ్యాన్ని పెంపొందించుకున్నామన్నారు.  ఈ భేటీలో ఎన్సీపీ నేత శరద్‌పవార్, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, తెలంగాణ సీఎం కే చంద్ర శేఖర రావు,  పశ్చిమబెంగాల్‌ సీఎం మమత బెనర్జీ, డీఎంకే నేత స్టాలిన్, బిహార్‌ సీఎం, జేడీయూ నేత నితీశ్‌ కుమార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన నేత ఉద్ధవ్‌ ఠాక్రే, సీపీఎం నేత సీతారాం యేచూరి పాల్గొన్నారు.

చైనా పెట్టుబడులు వద్దు: మమత
భారత్‌లోని మౌలిక వసతుల రంగంలో చైనా పెట్టుబడులను అంగీకరించవద్దని తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్, పశ్చిమబెంగాల్‌ సీఎం మమత బెనర్జీ సూచించారు. ఈ సంక్షోభ సమయంలో తమ పార్టీ కేంద్రానికి మద్దతుగా నిలుస్తుందన్నారు.    

కమిటీ ఏర్పాటు చేస్తారా?: యేచూరి
చైనాతో సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడ్డానికి, 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడానికి నిఘా వైఫల్యం కారణమా అని తేల్చేందుకు ఏదైనా కమిటీని నియమిస్తారా? అని సీపీఎం నేత సీతారాం యేచూరి ప్రశ్నించారు. గతంలో కార్గిల్‌ వార్‌ అనంతరం.. వైఫల్యాలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఒక కమిటీ వేసిన విషయాన్ని యేచూరి గుర్తు చేశారు.  

మీ సైనికులెవరూ మా ఆధీనంలో లేరు:చైనా
బీజింగ్‌: భారతీయు సైనికులు ఎవరూ ‘ప్రస్తుతం‘తమ ఆధీనంలో లేరని చైనా శుక్రవారం స్పష్టం చేసింది. తూర్పు లడాఖ్‌ సరిహద్దుల్లో జూన్‌ 15న భారత్‌ చైనాల మధ్య ఘర్షణలో పొరుగుదేశం మన సైనికులను బందీలుగా చేసి తీసుకెళ్లిందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో చైనా  విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావ్‌ లిజియాన్‌ మీడియాకు ఈ విషయం తెలిపారు.

నిఘా వైఫల్యమా?: సోనియా
సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల్లో 20 మంది భారత జవాన్ల మృతికి నిఘా వైఫల్యం కారణమా? అని సోనియాగాంధీ ప్రశ్నించారు. గాల్వన్‌ లోయలో యథాతథ స్థితి నెలకొంటుందని, చైనా వెనక్కు వెళ్తుందని హామీ ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరారు. భేటీ ప్రారంభంలో సోనియా పలు ప్రశ్నలను సంధించారు. చైనా దళాలు తూర్పు లద్దాఖ్‌లో భారత భూభాగంలోకి వచ్చాయా? వస్తే ఎప్పుడు వచ్చాయి? ఆ ప్రాంతంలో చైనా దళాల అసాధారణ కదలికలపై మన నిఘా సంస్థలు సమాచారం ఇవ్వలేదా? అని ఆమె ప్రశ్నించారు. తదుపరి కార్యాచరణ ఏమిటన్నారు. సైనికుల మధ్య ఘర్షణలు ప్రారంభమైన మే 5 నుంచి జూన్‌ 6 వరకు విలువైన కాలాన్ని ప్రభుత్వం వృధా చేసిందని  ఆరోపించారు.  

మమ్మల్ని ఆహ్వానించరా?
ఈ భేటీకి ఆహ్వానించకపోవడంపై ఆప్, ఆర్జేడీ, ఎంఐఎం ఆగ్రహం వ్యక్తం చేశాయి.  దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరాయి. ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్‌యాదవ్, ఆయన కూతురు మీసాభారతి, ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌ ప్రాంగణంలో నిరసన తెలిపారు. బిహార్‌లో తమది ప్రధాన ప్రతిపక్షమని, ఈ భేటీకి ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. అయితే, అన్ని గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, లోక్‌సభలో ఐదుగురు, లేదా ఆపై ఎంపీలున్న పార్టీలు, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు, కేబినెట్‌లో మంత్రులున్న పార్టీలను మాత్రమే భేటీకి ఆహ్వనించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

లేహ్‌లో ఐఏఎఫ్‌ చీఫ్‌
భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో.. భారత వైమానిక దళాధిపతి చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా లేహ్, శ్రీనగర్‌ల్లో పర్యటించారు. ఎయిర్‌ఫోర్స్‌ సన్నద్ధతను పరిశీలించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top