అయ్యో ఇన్ని రోజులు న్యూటన్‌ అనుకున్నా?.. కాదా?

Piyush Goyal Says Maths didn't help Einstein Discover Gravity - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు ప్రస్తుత ఆర్థిక మాంద్యానికి గల కారణాలపై చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆటో రంగం కుదేలవడానికి గల కారణాలు చెప్పి అబాసు పాలవగా.. తాజాగా మరో కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ తన వ్యాఖ్యలతో నవ్వుల పాలయ్యారు. గురువారం ఓ సమావేశానికి హాజరైన గోయల్‌.. ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దేశంగా అడుగులు వేస్తోందని, దానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత జీడీపీ ఎలా ఉన్నా తమ లక్ష్యానికి ఏ మాత్రం అడ్డుకాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ‘ఇంట్లో కూర్చొని టీవీల్లో చూస్తూ లెక్కలు వేయకండి. అసలు గణితాన్ని మర్చిపోండి. ఐన్‌స్టీన్‌ గురత్వాకర్షణ శక్తిని గణితాన్ని ఉపయోగించి కనుక్కొలేదు. ఒ​క వేళ గణితం ద్వారానే వెళ్లినట్లయితే ప్రపంచంలో ఏ ఆవిష్కరణ జరిగేది కాదని నా అభిప్రాయం’ అంటూ గోయల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అయితే గోయల్‌ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు మండిపడుతుండగా మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అసలు గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్నది న్యూటన్‌ అని ఐన్‌స్టీన్‌ కాదనే విషయాన్ని కేంద్ర మంత్రి తెలుసుకోవాలని కొందరు నెటిజన్లు కామెంట్‌ చేశారు. కాంప్లెక్‌ మ్యాథమెటికల్‌ ఈక్వేషన్స్‌ లేనిదే సైన్స్‌ లేదనే విషయాన్ని గోయల్‌ గుర్తుంచుకోవాలని మరికొందరు సూచించారు. జీడీపీతో సంబంధం లేకుండా బలమైన ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ‘ఇలాంటి మేధావుల చేతిలో భారత ఆర్థిక వ్యవ​స్థ ఐదు ట్రిలియన్ల డాలర్లేంటి పది ట్రిలియన్లకు వెళుతుంది’ , ‘అయ్యో ఇన్ని రోజులు గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్నది న్యూటన్‌ అనుకున్నా.. కాదా?’అంటు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా, దేశంలో మిలీనియల్స్ (2000 సంవత్సరం, ఆ తర్వాత పుట్టిన వారు) ఎక్కువగా ఓలా, ఉబర్ వంటి వాటిని వినియోగిస్తున్నారని, అందుకే కార్ల అమ్మకాలు తగ్గిపోయాయని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌తో సహా నెటిజన్లు మండిపడిన విషయం తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top