వేధింపులపై విచారణకు హాజరైన సీజేఐ

Panel examines CJI Ranjan Gogoi in harassment probe - Sakshi

భారత న్యాయచరిత్రలో ఇదే తొలిసారి

విచారణకు సహకరించిన జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై రహస్య విచారణ జరుపుతున్న త్రిసభ్య కమిటీ బుధవారం సీజేఐని కూడా విచారించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఇందూ మల్హోత్రా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీల త్రిసభ్య కమిటీ ఎదుట సీజేఐ విచారణకు హాజరయ్యారు.  లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో నిందితుడిగా ఓ సీజేఐ విచారణ కమిటీ ముందు హాజరవ్వడం భారత న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి. విచారణకు హాజరు కావాల్సిందిగా గతంలోనే ఈ కమిటీ సీజేఐని కోరింది. దీంతో ఆయన విచారణకు వచ్చిన తన వంతుగా సహకరించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని అయిన మహిళ, సీజేఐ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేయడం తెలిసిందే.

కాగా, ఫిర్యాదు చేసిన మహిళ మూడు రోజులపాటు విచారణకు హాజరైన అనంతరం, ఈ కమిటీతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదంటూ వెళ్లిపోవడం తెలిసిందే. కమిటీ విచారణ వాతావరణం తనకు భయాన్ని కలిగిస్తోందనీ, తన లాయర్‌ను కూడా తనతోపాటు ఉండనివ్వటం లేదనీ, న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె విచారణ నుంచి మంగళవారం అర్ధాంతరంగా వెళ్లిపోయారు. విచారణను ఆడియో లేదా వీడియో రికార్డింగ్‌ కూడా చేయటం లేదనీ, ఏప్రిల్‌ 26, 29 తేదీల్లో ఆమె ఇచ్చిన వాంగ్మూలం ప్రతులను కూడా తనకు ఇవ్వలేదని ఆమె వాపోయారు. విచారణ ఎలా జరుగుతుందీ, ఏయే విధానాలను అనుసరిస్తారు అనే దానిని కూడా తనకు చెప్పలేదని ఆమె పేర్కొన్నారు. ఆమె లేకపోయినా విచారణ కొనసాగుతుందని చెప్పినా ఆమె విచారణకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో సీజేఐని త్రిసభ్య కమిటీ బుధవారం విచారించింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top