పాకిస్థాన్ గూఢచారి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ గూఢచారి అరెస్ట్

Published Sat, Aug 20 2016 1:19 AM

పాకిస్థాన్ గూఢచారి అరెస్ట్ - Sakshi

రహస్య సమాచారం ఉన్నట్లు గుర్తించిన నిఘా వర్గాలు
జైపూర్: భారత్-పాక్ సరిహద్దులో ఉన్న రాజస్తాన్‌లోని  జైసల్మేర్‌లో ఓ హోటల్లో శుక్రవారం ఐఎస్‌ఐ గూఢచారి అన్న అనుమానంతో పాకిస్తాన్ జాతీయుడు నంద్ లాల్ మేఘ్‌వాల్‌ను నిఘావర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. అతణ్ని పాక్‌లోని సంగద్ జిల్లావాసిగా  గుర్తించారు. ఈ నెల మొదట్లో వీసా మీద  భారత్‌కు వచ్చాడని, అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మెమరీ కార్డులో రక్షణ శాఖకు సంబంధించిన స్థావరాలు, వాహనాల ఫొటోల సమాచారం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

రాజస్తాన్ సరిహద్దు నుంచి వివిధ వస్తువులను అక్రమంగా దేశంలోకి తెచ్చి రక్షణ శాఖ సమాచారం సేకరించడానికి వాటిని తక్కువ ధరకు అమ్మేవాడని ఏడీజీ యూఆర్ సాహు పేర్కొన్నారు. నిందితుడు సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తాన్‌కు సమాచారం చేరవేసేవాడన్నారు. జోధోపూర్‌కు మాత్రమే వీసా అనుమతి ఉండగా జైసల్మేర్‌లోకి ప్రవేశించి వీసా నిబంధనలను ఉల్లంఘించాడని అడిషనల్ సీఐడీ రాజీవ్ దత్తా చెప్పారు. రాజస్తాన్ హోం మంత్రి గులబ్‌చంద్ కటారియా మాట్లాడుతూ..నిందితుడు వీసా మీద పలు సార్లు భారత్‌కు వచ్చాడని తెలిపారు. విచారణ చేపట్టడానికి నిందితుడిని జైపూర్ తరలించారు.

Advertisement
Advertisement