మధ్యంతర ఉత్తర్వులుండవ్‌!

No Interim Order On Reservation In Government Job Promotions - Sakshi

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లపై సుప్రీం స్పష్టీకరణ

ఆగస్టు 3కు వాయిదా

రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ వర్తించదంటూ 2006లో సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వోద్యోగాల్లో ప్రమోషన్ల విషయంలో క్రీమీలేయర్‌ వర్తింపుపై 2006నాటి తీర్పు (ఎం.నాగరాజ్‌ తీర్పు అనికూడా పిలుస్తారు)కు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టంచేసింది. ‘2006 తీర్పు’ను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ధర్మాసనం ఆదేశించింది.

మధ్యంతర ఉపశమన చర్యలు ఇచ్చేందుకు కేసు విచారించబోమని, కూలంకషంగా చర్చిస్తామని స్పష్టం చేసింది. ‘ఈ విషయాన్ని రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది. ఇందుకోసం ఎం నాగరాజు తీర్పుపై విచారించేందుకు ఏడుగురు సభ్యులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తాం’ అని వెల్లడించింది. తదుపరి విచారణ ఆగస్టు 3న జరుగుతుందని స్పష్టం చేసింది.

నియామకాలు ఆగిపోయాయ్‌: కేంద్రం
వివిధ న్యాయపరమైన ప్రకటనల కారణంగా రైల్వేలు, ఇతర సేవా రంగాల్లో లక్షల ఉద్యోగాల నియామకాలు ఆగిపోయాయని, దీనిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టాలని అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ వాదన వినిపిస్తూ.. వివిధ బెంచ్‌లు, హైకోర్టులు ఇటీవల ఇచ్చిన తీర్పుల కారణంగా రిజర్వేషన్లపై గందరగోళం నెలకొందన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో ‘స్టేటస్‌ కో’ నెలకొందంటూ ఓ హైకోర్టు తీర్పు వెల్లడించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ప్రభుత్వం పదోన్నతులకు సిద్ధమవుతున్న సమయంలో జస్టిస్‌ కురియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును పెండింగ్‌లో పెట్టిందన్నారు. ధావన్‌ వాదనలను వేణుగోపాల్‌ సమర్థించారు. పదోన్నతుల్లో రిజర్వేషన్‌పై గందరగోళం నెలకొందని.. ఈ పరిస్థితికి ముగింపు పలకాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు.  మహారాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న మరో సీనియర్‌ న్యాయవాది శేఖర్‌ నాఫడే మాత్రం.. ఈ విషయంలో గందరగోళం లేదన్నారు. పలు పక్షాలు వాదిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

క్రీమీలేయర్‌ వర్తించదు: నాటి తీర్పులో సుప్రీం
2006 నాటి ‘ఎం నాగరాజ్, ఇతరులు వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం’ తీర్పును పునఃపరిశీలించాలా వద్దా? అనే అంశాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయిస్తుందని గతేడాది నవంబర్‌ 15న ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వోద్యోగాల పదోన్నతుల్లో క్రీమీలేయర్‌ వర్తించదంటూ ఎం నాగరాజు తీర్పులో 2006లో సుప్రీం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top