నీరవ్‌ మోదీకి ముంబై కోర్టు భారీ షాక్‌

Nirav Modi Declared As Fugitive Economic Offender - Sakshi

న్యూఢిల్లీ : పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ(48)కి ముంబైలోని స్పెషల్‌ కోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి(ఎఫ్‌ఈవో)గా నీరవ్‌ను గుర్తిస్తూ ప్రకటన విడుదల చేసింది. మనీలాండరింగ్‌ చట్టం కింద ముంబైలోని అక్రమ నగదు చెలామణి నిరోధక(పీఎంఎల్‌ఏ) కోర్టు అతడిని ఆర్థిక నేరగాడిగా పేర్కొంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)ను రూ.14వేల కోట్ల మేర మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్‌ మోదీ లండన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిని అప్పగించాలంటూ భారత్‌ యూకేను కోరుతోంది. ఈ నేపథ్యంలో లండన్‌లో అరెస్టైన నీరవ్‌.. బెయిల్‌ కోసం పిటిషన్‌ పెట్టుకోగా నాలుగుసార్లు తిరస్కరణకు గురైంది. దీంతో అతడిని నైరుతి లండన్‌లోని వాన్‌డ్స్‌వర్త్‌ జైలుకు తరలించారు. 

ఈ క్రమంలో డిసెంబర్‌ 4న వీడియో లింక్‌ ద్వారా అతడిని కోర్టు విచారించనుందని వార్తలు వెలువడ్డాయి. కాగా నీరవ్‌ మోదీ బెయిల్‌ పిటిషన్‌ను భారత్‌ తరపున వాదిస్తున్న న్యాయవాది లండన్‌ కోర్టులో సవాల్‌ చేశారు. ఇక భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని నీరవ్‌ మోదీ బెదిరించిన విషయం తెలిసిందే. కాగా భారత బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను ముంబై కోర్టు ఆర్థిక నేరస్తుడిగాఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. తాజా పరిణామాల నేపథ్యంలో మాల్యా తర్వాత ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిన రెండో వ్యక్తిగా నీరవ్‌ నిలిచాడు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top